సింగరేణి గ్రాస్ ఫ్రాఫిట్‌లో కార్మికుల వాటా ఇవ్వాలి...
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:22 PM
సింగరేణి లాభాల వాటాను కార్మికులకు మొత్తం గ్రాస్ ప్రాఫిట్‌పై ఇవ్వాల్సిందని, సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికుల వాటా ముందుగా పక్కకు పెట్టి తరువాత అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాల్సిందని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
-లాభాల వాటా సీఎం బిక్షం వేసినట్లు ప్రకటించిండు
-సంస్థ దివాలా తీయడానికి కాంగ్రెస్సే కారణం
-పెద్దపల్లి, మంచిర్యాలలో కాంగ్రెస్ గూండాయిజం పెరిగింది
-సమయం, అవసరాన్నిబట్టి జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటిస్తం
-శ్రీరాంపూర్‌లో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
మంచిర్యాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సింగరేణి లాభాల వాటాను కార్మికులకు మొత్తం గ్రాస్ ప్రాఫిట్‌పై ఇవ్వాల్సిందని, సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికుల వాటా ముందుగా పక్కకు పెట్టి తరువాత అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించాల్సిందని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆనాటి ఆంధ్ర వలస పాలనలో మన యువతకు ఉద్యోగాలు అంటే కేవలం బొగ్గు బాయిలే ఉండేవని, ఇక్కడి ప్రజలకు బతుకుదెరువును చూపిన సిరులవేణి సింగరేణికి ప్రభుత్వం దాదాపు రూ. 42వేల కోట్లు బకాయిలు పెట్టి ఎలా దివాలా తీయిస్తుందో కార్మికులు అర్థం చేసుకోవాలని కవిత అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో మంగళవారం సాయంత్రం జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు కవిత శ్రీరాంపూర్‌కు వచ్చారు. మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఉన్నపుడు తాము లాభాల వాటాను కార్మికులకు మొత్తం గ్రాస్ ప్రాఫిట్‌పై చెల్లించామని, టోటల్ లాభాల్లో వాటా ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా 70 శాతం అభివృద్ధి పేరిట నిధులు పక్కన పెట్టి, ఆ తరువాత 34 శాతం లాభాల వాటా అని చెబుతున్నారని, దీనివల్ల కార్మికులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఒక్కో కుటుంబానికి లక్షా 50వేలు తగ్గాయన్నారు. కార్మికుల కోసమే కదా కొట్లాడింది...ఈ కార్మికుల కోసమే కదా తెలంగాణ తెచ్చుకుందంటూ దీన్ని తాము చూస్తూ ఊరుకోమని అన్నారు. లెక్కల గారడి చేసి కార్మికులను మోసం చేస్తామంటే ఎల్లకాలం నడవదని, ఇంటికి లక్ష రూపాయలు ముఖ్యమంత్రి లాస్ చేసాడని ఎద్దేవా చేశారు. లాభాల్లో వాటా కార్మికులకు భిక్షం వేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని, అది కరెక్టు కాదన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు. సంస్థలో రాజకీయ జోక్యాన్ని సహించేదిలేదని, కార్మికుల చెమటతో తెలంగాణలో ప్రతి ఇంట్లో బుగ్గ వెలుగుతోందని, ఫ్యాన్ తిరుగుతోందని అన్నారు. ఆ విషయం మర్చిపోవద్దని హితవు పలికారు. గనులు, కార్మికులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
కొత్త బాయిలు తెరిచి, ఇక్కడి యువతకు కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి, కాంగ్రెస్ వచ్చిన తరువాత ఎక్కడో కర్నాటకలో బంగారం గని, ఇంకెక్కడో రాగి గని కొన్నారని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే ఆ గనులు ఏర్పాటు చేసేందుకు కూడా డబ్బులు లేవని ఎల్‌ఐసీ దగ్గర రూ. 3వేల కోట్లు అప్పు అడగడం సిగ్గు చేటన్నారు. స్వయంగా ప్రభుత్వం దగ్గర సింగరేణి సొమ్ము రూ. 42 వేల కోట్లు ఉంటే, దాన్ని ప్రభుత్వం సంస్థకు ఇయ్యకుండా, ఇతర గనులను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించకుండా, ఖర్చుల కోసం ఎల్‌ఐసీని అడుక్కొనే పరిస్థితి కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థను ఎలా దివాలా తీయిస్తున్నదో కార్మికులు అర్థం చేసుకోవాలన్నారు. ముందుగా కాంగ్రెస్ నేతలు అవినీతిని తగ్గించుకోవాలని, వారు అవినీతిని తగ్గించుకుంటే కొత్తబాయిలు, ప్రాజెక్టులు వస్తాయని, అప్పుడు వందలు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని, ఆ దిశగా ప్రయత్నం చేయాలని అన్నారు.
పెద్దపలి,్ల మంచిర్యాల జిల్లాల్లో చూస్తే ఆడికెళ్లి ఈడిదాకా కాంగ్రెస్ నాయకులు గెలిచి కూర్చున్నారనీ, పోనీ ఎమన్నా మంచి పనులు చేసిండ్రా అంటే.... మొత్తం గూండాయిజమే చేస్తున్నారని ఆరోపించారు. అందరినీ కొట్టించడం, జైళ్లో పెట్టడం, పోలీసులకు పట్టించడం వంటి చర్యలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా....? పోలీస్ రాజ్యం నడుస్తుందా....? అర్థంగాని పరిస్థితి ఉందన్నారు. దాన్ని తగ్గించుకోవలసిన అవసరం ఉందని, తెలంగాణ ప్రజలు కొన్ని రోజులే సైలెంట్‌గా ఉంటారని, ఎవరు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటారన్నారు. ఇట్లనే దౌర్జన్యం చేస్తే మళ్లీ అవకాశం వచ్చినప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెడతారు తప్ప....అధికారంలో కొనసాగించన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
సింగరేణి జాగృతి భవిష్యత్తులో రాజకీయ పార్టీగా అవతరిస్తదా..? అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ భవిష్యత్తులో జాగృతి ఏం చేస్తుందన్నది సింగరేణి కార్మికులే నిర్ణయించాలన్నారు. తెలంగాణ రాకుముందు కూడా కార్మికుల మధ్యనే తాను ఉన్నానని, అప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట బతుకమ్మ ఆడానన్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నానని, రేపు పొద్దున కూడా ఏం జేయాలన్న సింగరేణి కార్మికుల వద్దకే వస్తానని స్పష్టం చేశారు. ఆ తరువాత సమయం, అవసరాన్ని బట్టి ప్రకటిస్తామన్నారు. ఇది తన ఒక్కదాని లాభం కోసం కాదని, ఏం చేసినా అందరికి మంచి కోసం చేయాలని, దాని కోసం ప్రయత్నిస్తానని తెలిపారు.
సింగరేణి జాగృతి అధ్యక్షురాలిగా కొత్త గనులు రావడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించగా,
కేసీఆర్ సంవత్సరానికి ఐదు గనులు ఓపెన్ చేయవచ్చనే సమగ్ర రిపోర్టు తయారు చేయించారన్నారు. దాన్ని కార్రరూపంలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క గని కూడా తెరిచే ఉద్దేశ్యం లేదని, సంవత్సరానికి 5 గనులు తెరవండని సూచించారు. ఇటీవల సీఎండీని కలిసి కొత్త గనుల ఏర్పాటుపై చర్చించామని, అందుకోసం హెచ్‌ఎంఎస్, సింగరేణి జాగృతి కలిసి పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు.