Share News

kumaram bheem asifabad- పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:11 PM

ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్‌లో చేపడుతున్న ఇందిరమ్మ ఇంటినిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు

kumaram bheem asifabad-  పనులు వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల పనుల వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

కాగజ్‌నగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్‌లో చేపడుతున్న ఇందిరమ్మ ఇంటినిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్లో ఎలాంటి ఆలస్యం చేయవద్దన్నారు. త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే ఎలాంటి సమస్యలున్నా కూడా లబ్ధిదారులు వెంటనే అధికారులను సంప్రదించాలన్నారు. పెండింగ్‌ పెట్టకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ పథకం లబ్ధిపొందిన లబ్ధిదారులకు గూడు దొరుకుతుందన్నారు. ఇంటి నిర్మాణాల కోసం ఉచితంగా ఇసుకను అందిస్తున్నామని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్‌ మధూకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): నైపుణ్యతను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. మంగళవారం కాగజ్‌నగర్‌ సుప్రభాత్‌ పాఠశాలలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం కింద నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాం, తహసీల్దార్‌ మధూకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆకాంక్షిత బ్లాక్‌లో భాగంగా జిల్లాలోని తిర్యాణి మండలంలో చేపట్టిన పనులపై పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి తిర్యాణి మండలంలో చేపట్టిన కార్యక్రమాలపై విద్య, వైద్య, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాక్‌లో భాగంగా తిర్యాణి మండలంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకు రావాలని, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ కార్యదర్శి పనుల పురోగిపై పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సీతారాం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ శాఖాధికారి భాస్కర్‌, ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి, విద్యాశాఖ ప్రణాళిక సమన్వయకర్త అబిద్‌ అలీ, ఎంపీడీవో మల్లేష్‌, పంచాయతీరాజ్‌, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 10:11 PM