Share News

New IPS Officers: ఐపీఎస్‌‌లలో 36శాతానికి పెరిగిన మహిళల వాటా

ABN , Publish Date - Oct 16 , 2025 | 01:48 AM

దేశంలో ఐపీఎ్‌సలో చేరుతున్న మహిళల సంఖ్య ఐదేళ్లుగా పెరుగుతూ వచ్చి, ప్రస్తుతం 36శాతానికి చేరిందని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ పోలీసు అకాడమీ...

New IPS Officers: ఐపీఎస్‌‌లలో 36శాతానికి పెరిగిన మహిళల వాటా

  • తెలంగాణ నుంచి తగ్గిన ప్రాతినిధ్యం.. 4 నుంచి 1 శాతానికి చేరిక

  • నేషనల్‌ పోలీసు అకాడమీ డైరెక్టర్‌ అమిత్‌గర్గ్‌ వెల్లడి

  • తెలంగాణ, ఏపీలకు నలుగురు చొప్పున ఐపీఎ్‌సల కేటాయింపు

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఐపీఎ్‌సలో చేరుతున్న మహిళల సంఖ్య ఐదేళ్లుగా పెరుగుతూ వచ్చి, ప్రస్తుతం 36శాతానికి చేరిందని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ పోలీసు అకాడమీ డైరెక్టర్‌ అమిత్‌ గార్గ్‌ వెల్లడించారు. ఈ నెల 17న అకాడమీలో 77వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 77వ బ్యాచ్‌లో మొత్తం 190 మందికి ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌ శిక్షణ ఇచ్చామని, వారిలో 174 మంది డైరెక్ట్‌ ఐపీఎ్‌సలు కాగా.. 16 మంది నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారని చెప్పారు. దేశానికి చెందిన 174మందిలో 65మంది మహిళా అధికారులని.. ఐదేళ్ల క్రితం మహిళా అధికారులు 20.66 శాతంకాగా, ఈసారి 35.63 శాతానికి పెరిగిందని తెలిపారు. ఐపీఎ్‌సలో చేరుతున్న వారిలో గతంలో ఇంజనీరింగ్‌ చదివినవారు 69శాతం ఉండేవారని, ప్రస్తుతం 50శాతానికి తగ్గిందని.. ఆర్ట్స్‌, సైన్స్‌ గ్రూపుల నుంచి చేరుతున్నవారి సంఖ్య పెరిగిందని అమిత్‌గార్గ్‌ తెలిపారు. 25ఏళ్ల వయసులోపు ఐపీఎస్‌ సాధిస్తున్న యువత శాతం పెరుగుతోందని.. ఐదేళ్ల క్రితం ఇలాంటివారు 4శాతమే ఉంటే, ఈసారి 12శాతం ఉన్నారని తెలిపారు. మరోవైపు 28 ఏళ్లుదాటిన తర్వాత ఐపీఎ్‌సలో చేరుతున్నవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని వెల్లడించారు. తెలంగాణ నుంచి ఐపీఎ్‌సకు ఎంపికవుతున్న వారి సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. ఐదేళ్ల క్రితం 4శాతం ఉంటే, గత మూడేళ్లు 3శాతం, ఈసారి కేవలం ఒక్కశాతమే ఉన్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూడా 5శాతం నుంచి 3 శాతానికి ప్రాతినిధ్యం పడిపోయిందన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెనుసవాళ్లలో ఒకటైన సైబర్‌ క్రైమ్‌పై యువ ఐపీఎ్‌సలకు శిక్షణ ఇచ్చామని గార్గ్‌ తెలిపారు. ప్రస్తుత ఐపీఎస్‌ బ్యాచ్‌లో ఏపీకి చెందిన కొయ్యే చిట్టిరాజు, కాకుమాను అశ్విన్‌ మణిదీప్‌, కె.శ్రీనివాసులు, మర్రిపాటి నాగభరత్‌, మన్నం సుజిత్‌ సంపత్‌, తెలంగాణకు చెందిన అభిజిత్‌ పాండే, ఎస్‌.దీప్తిచౌహన్‌ ఉన్నట్టు తెలిపారు. ఇక తెలంగాణ కేడర్‌కు రానున్న ఐపీఎ్‌సలలో.. ఆయేషా ఫాతిమా (ఎంపీ), సోహం సునీల్‌(మహరాష్ట్ర), మనీషా నెహ్రా (రాజస్థాన్‌), రాహుల్‌ కాంత్‌ (జార్ఖండ్‌) ఉన్నారు. ఏపీకి రానున్నవారిలో.. కాకుమాను అశ్విన్‌ మణిదీప్‌ (ఏపీ), జాదవ్‌రావ్‌ నిరంజన్‌(మహరాష్ట్ర), జయశర్మ (ఢిల్లీ), తరుణ్‌ (హర్యానా) ఉన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 02:35 AM