Share News

Indira Mahila Shakti: సత్తా చాటిన మహిళలు!

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:28 AM

ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు, అల్లికలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాలకి చేదోడు వాదోడుగా నిలిచిన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వ్యాపారం ఏదైనా..

Indira Mahila Shakti: సత్తా చాటిన మహిళలు!

  • లాభాల బాటలో నారాయణపేట మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌

  • ఆరు నెలల్లో రూ. 15.50 లక్షల లాభం

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు ఇంట్లో కూర్చుని కుట్లు, అల్లికలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసి కుటుంబాలకి చేదోడు వాదోడుగా నిలిచిన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వ్యాపారం ఏదైనా సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఓ మహిళా సమాఖ్యకి కేటాయించిన పెట్రోల్‌ బంక్‌ ఆరు నెలల్లో రూ.లక్షల్లో లాభాలు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు సత్తా చాటారు. ఇది నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య సాధించిన అద్భుత విజయం. ఇందిరా మహిళాశక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లా సింగారం క్రాస్‌రోడ్డులో రూ.1.30కోట్లతో పెట్రోల్‌బంక్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారిగా దీన్ని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యకు కేటాయించారు. ఈ బంక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. 20 ఏళ్లకు నెలకు రూ.10వేల అద్దె ప్రాతిపదికన మహిళా సమాఖ్య ద్వారా పెట్రోల్‌ బంక్‌ను నడిపేందుకు బీపీసీఎల్‌ సంస్థతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. దీని నిర్వహణకు 11మంది మహిళలకు ముందస్తుగా జడ్చర్ల, షాద్‌నగర్‌లోని పెట్రోల్‌ బంక్‌ల్లో మేనేజర్‌, సేల్స్‌విమెన్లుగా ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. మొత్తం వ్యయంలో మౌలిక వసతుల కల్పనకు రూ.15లక్షలు ఖర్చు చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్‌ బంక్‌ నిర్వహణను జిల్లా కలెక్టర్‌ సమీక్షిస్తున్నారు.బంక్‌లో విధులు నిర్వర్తించే 10మంది మహిళలు ఒక్కొక్కరికి రూ.13,200చొప్పున, మహిళా మేనేజర్‌కు రూ.18,000 వంతున వేతనంగా జిల్లా సమాఖ్య చెల్లిస్తోంది. రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్‌.. 6 వేల లీటర్ల డీజిల్‌ను విక్రయిస్తుండగా.. సిబ్బంది వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు పోను గత ఆరు నెలల్లో రూ.15.50 లక్షల లాభాలు ఆర్జించినట్టు పెట్రోల్‌బంక్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రకళ తెలిపారు. మహిళా సమాఖ్య దీన్ని విజయవంతంగా నిర్వహిస్తుండడంతో.. కొత్త బంకుల ఏర్పాటులోనూ మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Sep 08 , 2025 | 03:29 AM