Share News

Hyderabad Metro: రాత్రివేళల్లో మెట్రో స్టేషన్ల దగ్గర మహిళలపై లైంగిక వేధింపులు

ABN , Publish Date - Sep 17 , 2025 | 05:15 AM

మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద రాత్రి పూట మహిళా ప్రయాణికులు లైంగిక వేధింపులు, ఆకతాయిల ఆగడాలను ఎదుర్కొంటున్నట్లు ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ) సెకండియర్‌ విద్యార్థుల సర్వేలో తేలింది. రాత్రి సమయాల్లో మెట్రో బోగీల్లో లైటింగ్‌...

Hyderabad Metro: రాత్రివేళల్లో మెట్రో స్టేషన్ల దగ్గర మహిళలపై లైంగిక వేధింపులు

  • రాత్రి సమయాల్లో బోగీల్లో లైటింగ్‌ తక్కువ

  • ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థుల సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద రాత్రి పూట మహిళా ప్రయాణికులు లైంగిక వేధింపులు, ఆకతాయిల ఆగడాలను ఎదుర్కొంటున్నట్లు ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ) సెకండియర్‌ విద్యార్థుల సర్వేలో తేలింది. రాత్రి సమయాల్లో మెట్రో బోగీల్లో లైటింగ్‌ తక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. మెట్రో రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు, మహిళలకు ప్రత్యేక బోగీలు ఉన్నప్పటికీ సిబ్బంది పర్యవేక్షణ కొరత ఉందని మహిళా ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో రోజుకు సగటున 4.80 లక్షల మందికి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న మెట్రో రైళ్లలో మహిళల ప్రయాణం, భద్రతపై విద్యార్థులు 15రోజుల పాటు సర్వే నిర్వహించారు. ఆ రిపోర్టును మంగళవారం ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ చైర్మన్‌ కాళీప్రసాద్‌ ఆధ్వర్యంలో విడుదల చేశారు. విద్యార్థులు అమీనాబేగం, ఖతీజా తుల్‌కుబ్రా, తరుణిరెడ్డి, సుఖ్‌జోథ్‌సింగ్‌ ఈ రిపోర్టును రూపొందించారు. ఈ రిపోర్టును మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖాగోయల్‌కు కూడా అందజేశారు. విద్యార్థులు ప్రపంచంలోని 247పైగా మెట్రోలు, మన దేశంలోని 15 మెట్రోలతో హైదరాబాద్‌ మెట్రోను పోల్చి చూశారు. అన్నింటితో పోల్చి చూస్తే హైదరాబాద్‌ మెట్రో భద్రతాపరంగా బాగుందన్నారు.

టీ సేఫ్‌ యాప్‌పై అవగాహన అంతంతే

ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులు రాయదుర్గం, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-5, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, ప్యారడైజ్‌, సికింద్రాబాద్‌ ఈస్ట్‌, ఉప్పల్‌, నాగోల్‌ తదితర స్టేషన్లలో ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు 15 రోజులపాటు సర్వే నిర్వహించారు. మొత్తం 410 మంది ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సర్వే ప్రకారం.. మెట్రో స్టేషన్ల దగ్గర తాము లైంగిక వేధింపులకు గురైనట్లు 11ు మంది మహిళలు చెప్పారు. మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలకు టీ సేఫ్‌ యాప్‌/హెల్ప్‌లైన్లపై అవగాహన అంతంతమాతమ్రే. ప్రయాణికుల్లో 12ు మందే వీటిని వినియోగిస్తున్నారు.

భద్రతా చర్యలను మెరుగుపరుస్తాం: ఎన్వీఎస్‌ రెడ్డి

ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థుల రిపోర్టుపై ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. సర్వేలోని సిఫారసులు మహిళా ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని భద్రతా చర్యలను మెరుగుపరుస్తామని చెప్పారు. బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థుల అధ్యయనం తమకు మరింత శక్తినిస్తుందని శిఖాగోయల్‌ అన్నారు. మెట్రోలో ప్రతి మహిళా గౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ప్రయాణించే విధంగా తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - Sep 17 , 2025 | 05:15 AM