Share News

Mallu Bhatti Vikramarka: మహిళా శక్తికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం

ABN , Publish Date - Sep 21 , 2025 | 07:16 AM

మహిళలను మహాలక్ష్మిలుగా చూడాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని, వారు ఆర్థికంగా నిలదొక్కుకుని, శక్తిమంతులుగా ఎదిగేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం...

 Mallu Bhatti Vikramarka: మహిళా శక్తికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం

  • మహిళా సంఘాల సభ్యుల సంఖ్య పెంచుతాం.. వారి ద్వారా ఆర్టీసీకి మరో 450 బస్సులు లీజుకు..

  • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

  • ఏడాదిలో రూ.21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం:భట్టి

  • రూ.41.51 కోట్ల రుణాల పంపిణీ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/యూసు్‌ఫగూడ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళలను మహాలక్ష్మిలుగా చూడాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని, వారు ఆర్థికంగా నిలదొక్కుకుని, శక్తిమంతులుగా ఎదిగేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. అందుకే ఇందిరా మహిళా శక్తి పథకం తీసుకొచ్చామని, ఐదేళ్లలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్‌ చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించినప్పుడు ప్రతిపక్షాలు హేళన చేశాయని, వారి అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి సంవత్సరమే రూ.21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించి రికార్డు సృష్టించామని, ఇది తమ సంకల్ప బలమని చెప్పారు. శనివారం యూసు్‌ఫగూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌, గడ్డం వివేక్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో కలిసి స్వయం సహాయక సంఘాలకు మెప్మా ద్వారా రూ.41.51 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని 8,130 మంది మహిళలు ఈ పంపిణీ ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలోని పొదుపు సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులుంటే... జీహెచ్‌ఎంసీ 30 సర్కిళ్లలోని 50,764 మహిళా సంఘాల్లో 5,09,957 మంది ఉన్నారని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచుతామన్నారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాల సభ్యులు పెట్టుబడుల కోసం ఏ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లాల్సిన పని ఉండదన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు వడ్డీ లేని రుణాల అంశాన్ని, మహిళా సాధికారతను గాలికి వదిలేసిందని విమర్శించారు.

Updated Date - Sep 21 , 2025 | 07:17 AM