Dharavat Kalpana: హైకోర్టులో గెలిచి నామినేషన్ వేసి..
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:56 AM
ఓటరు జాబితాలో తన పేరు చేర్చాలని హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన ఓ మహిళ.. వెంటనే తమ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు...
మాడ్గులపల్లి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో తన పేరు చేర్చాలని హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించిన ఓ మహిళ.. వెంటనే తమ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం చౌళ్లతండాకు చెందిన ధరావత్ కల్పన రెండేళ్ల క్రితం మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన చింతమళ్ల రాంప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. తన ఓటును మాడ్గులపల్లి మండలానికి బదిలీ చేయాలని కల్పన దరఖాస్తు చేసుకోగా ఆన్‌లైన్ జాబితాలో ఆమె పేరు మాడ్గులపల్లి మండలంలో కనిపిస్తోంది. కానీ అధికారులు ఇటీవల విడుదల చేసిన ఓటర్ల జాబితాలో మాత్రం లేదు. దీంతో ఇందుగల సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు ఆమెకు అడ్డంకి ఎదురైంది. దీంతో కల్పన హైకోర్టును ఆశ్రయించగా.. కల్పన పేరును తక్షణమే మాడ్గులపల్లి మండల ఓటరు జాబితాలో చేర్చాలని హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం తీర్పు ఇచ్చింది. నామినేషన్ దాఖలుకు మంగళవారం చివరి రోజు కాగా.. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఇందుగులలోని రిటర్నింగ్ అధికారికి కల్పన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.