Share News

Bhupalpally: భర్త, కుమార్తె దారుణ హత్య

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:15 AM

తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ప్రియుడితో కలిసి కన్న కూతురినే గొంతు నులిమి హత్య చేసింది ఓ మహిళ. రెండు నెలల క్రితం భర్తను కూడా ఇదే తరహాలో హత్య చేసి...

Bhupalpally: భర్త, కుమార్తె దారుణ హత్య

  • ప్రియుడితో కలిసి మహిళ ఘాతుకం.. 2 నెలల క్రితం భర్తను చంపి అనారోగ్యంతో మృతిగా ప్రచారం

  • ఈ నెల 2న కుమార్తె హత్య

  • కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు

  • వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారనే దారుణాలు

  • భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి ఘటనలు

కృష్ణకాలనీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ప్రియుడితో కలిసి కన్న కూతురినే గొంతు నులిమి హత్య చేసింది ఓ మహిళ. రెండు నెలల క్రితం భర్తను కూడా ఇదే తరహాలో హత్య చేసి, అనారోగ్యం కారణంగానే అతడు మృతి చెందాడని నమ్మించింది. ఈ ఘటనలు భూపాలపల్లి జిల్లాలో ఒకేసారి వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 28న భూపాలపల్లి జిల్లాలో లభ్యమైన యువతి మృతదేహం విషయంలో పోలీసులు జరిపిన విచారణలో ఈ విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్‌ ఖరే బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి మొదటి భార్య మృతి చెందగా 24ఏళ్ల క్రితం మల్హర్‌ మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన కవితను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. చిన్న కుమార్తె హన్సిక పెళ్లి చేసుకొని ఇంట్లోం చి వెళ్లిపోగా పెద్ద కుమార్తె వర్షిణితో కుమారస్వామి, కవిత వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కుమారస్వామి పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితమయ్యాడు. ఈ క్రమంలో కవితకు అదే గ్రామానికి చెందిన అవివాహితుడైన జంజర్ల రాజ్‌ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచూ కలుసుకోవడాన్ని గమనించిన భర్త కుమారస్వామి భార్యను నిలదీశాడు. దీంతో కవిత అతడిని అంతమొందించేందుకు ప్రియుడు రాజ్‌కుమార్‌తో కలిసి ప్లాన్‌ వేసిం ది. జూన్‌ 25న కుమార్తె ఇంట్లో లేని సమయంలో కుమారస్వామిని కవిత కాళ్లు పట్టుకోగా రాజ్‌కుమార్‌ గొంతు నులిమాడు.


దీన్ని కవిత సాధారణ మృతిగా చిత్రీకరించింది. అయితే తల్లి కవిత ప్రవర్తనను గమనిస్తూ వస్తున్న వర్షిణికి ఆమెపై అనుమానం వచ్చిం ది. తండ్రి అనారోగ్యంతో ఉన్నా ఆకస్మికంగా ఎలా మృతి చెందాడని కొన్ని రోజుల తర్వాత ప్రశ్నించింది. రాజ్‌కుమార్‌ ఇంటికి వస్తుండటంపైనా తల్లిని నిలదీసింది. దీంతో కవిత ఆమెను కూడా కడతేర్చాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఆగస్టు 2న అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వర్షిణిని ఇద్దరు గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఒడితల గ్రామ శివారులో ప్రభుత్వ ఆస్పత్రి వెనుక చెట్ల పొదల్లో పడేశారు. ఆ తర్వాత తన కుమార్తె కనిపించడం లేదని కవిత చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆగస్టు 25న రాజ్‌కుమార్‌ తిరిగి శవాన్ని సంచిలో వేసుకొని బైక్‌పై తీసుకెళ్లి కాటారం జాతీయ రహదారి సమీపంలో పడేశాడు. శవంపై పసుపు, కుంకుమ చల్లి చుట్టూ ఇనుప మేకులు కొట్టాడు. క్షుద్ర పూజ లు చేసి ఎవరో నరబలి ఇచ్చారని చిత్రీకరించే యత్నం చేశాడు. పోలీసులు శవం దగ్గర ఆధార్‌కార్డు ఆధారంగా తల్లి కవితకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఆమె తన బిడ్డను ఎవరో చంపేశారంటూ గుండెలు బాదుకుంటూ పోలీసులను పక్కదోవ పట్టించింది. పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టగా తల్లే కూతురిని ప్రియుడితో కలిసి హత్య చేసిందని తేలింది. కవిత, రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. రెండు హత్యలు తామే చేసినట్టు వారు అంగీకరించారు.

Updated Date - Sep 04 , 2025 | 05:17 AM