Crime News: డబ్బుల కోసం మాజీ భర్త కిడ్నాప్
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:55 AM
ఓ మహిళ డబ్బు కోసం తన మాజీ భర్తను కిడ్నాప్ చేయించింది. ఈస్ట్‌జోన్ డీసీపీ బీ బాలస్వామి మంగళవారం అంబర్‌పేటలోని డీసీపీ కార్యాలయంలో..
ఇటీవల వారసత్వ ఆస్తి విక్రయంతో బాధితుడి చేతికి 20 కోట్లు.. కొందరితో కలిసి ఓ మహిళ పథకం
కేసును ఛేదించిన పోలీసులు
మహిళ, ఇతర నిందితుల అరెస్టు
అంబర్‌పేట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళ డబ్బు కోసం తన మాజీ భర్తను కిడ్నాప్ చేయించింది. ఈస్ట్‌జోన్ డీసీపీ బీ బాలస్వామి మంగళవారం అంబర్‌పేటలోని డీసీపీ కార్యాలయంలో ఈ కేసు వివరాలను తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్యామ్(55) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కొంతకాలం అమెరికాలో పనిచేశాడు. ఆ సమయంలో మాధవీలత(51)ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడ వారి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2005లో హైదరాబాద్‌కు వచ్చారు. విడాకులు తీసుకున్నా హైదరాబాద్‌లో 2022 వరకు కలిసి ఉండి రెస్టారెంట్ వ్యాపారం నిర్వహించారు. నష్టం రావడంతో అమ్మివేశారు. మూడేళ్లుగా శ్యామ్.. మాధవీలతకు దూరంగా అంబర్‌పేట డీడీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటూ ఆలీ అనే పేరుతో ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె ఆరాంఘర్‌లో ఉంటోంది. రెండు నెలల క్రితం శ్యామ్ తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బంజారాహిల్స్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌ను రూ. 20 కోట్లకు అమ్మివేశాడు. ఆ డబ్బు తనకు, తన పిల్లలకు దక్కదేమోనని మాధవీలత గతంలో రెస్టారెంట్ నిర్వహించినప్పుడు మేనేజర్‌గా పనిచేసిన అంబర్‌పేటకు చెందిన ఉండి దుర్గ వినయ్(32)ను సంప్రదించింది. తన భర్తను కిడ్నాప్ చేసి ఆస్తి రాయించుకోవాలన్న ఆలోచనను చెప్పింది. వినయ్ తన మిత్రుడు కట్ట దుర్గాప్రసాద్ ఆలియాస్ సాయి(32)ని మాధవీలతకు పరిచయం చేశాడు. ముగ్గురూ శ్యామ్‌ను కిడ్నాప్ చేయడానికి పథకం రూపొందించారు. సాయి తన మిత్రులు కాటమోని పురుషోత్తం(31), సందోలు నరే్‌షకుమార్(29), కోశకోలు పవన్‌కుమార్(25), నారాయణ రిషికేష్ సింగ్(23), పిల్లి వినయ్(29)లను కూడా కలుపుకొన్నాడు. శ్యామ్‌పై నిఘా ఉంచడానికి లేడీ బౌన్సర్ ప్రీతి(34), సరిత(32)లను అతని ఫ్లాట్ ఎదురు ఫ్లాట్‌లో రెండు రోజుల ముందు నుంచి ఉంచాడు. గత నెల 29న సాయంత్రం సాయి, అతని ముఠా రెండు కార్లలో వచ్చి శ్యామ్‌ను కిడ్నాప్ చేశారు. శ్యామ్ రెండోభార్య ఫాతిమా అదేరోజు అంబర్‌పేట పీఎ్‌సలో ఫిర్యాదు చేసింది. శ్యామ్‌ను కిడ్నాపర్లు విజయవాడ తీసుకెళ్లి... డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లో డబ్బులు ఇస్తానని చెప్పడంతో 31న అతన్ని తీసుకొచ్చారు. నిందితుల బారి నుంచి తప్పించుకుని శ్యామ్ ఫోన్ చేయడంతో అంబర్‌పేట పోలీసులు అతడిని కాపాడారు. నిందితులు పారిపోయారు. తనను కిడ్నాప్ చేస్తే కోటి రూపాయలు ఇస్తానని మాధవీలత చెప్పినట్లు కిడ్నాపర్లు చెప్పారని శ్యామ్ తెలిపాడు. పోలీసులు మంగళవారం కొందరు నిందితులను, మాధవీలతను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు.