Tragedy in Telangana: ఫోన్ మాట్లాడి..చెప్పకుండా వెళ్లిపోయాడని..
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:30 AM
ఫోన్ మాట్లాడిన భర్త.. ఆడిగినా చెప్పకుండా ఆదరబాదరాగా ఇంట్లోంచి వెళ్లిపోవడం, వెతికినా అతడి ఆచూకీ దొరక్కపోవడంతో మనస్తాపానికి గురైన భార్య..
భర్తపై భార్య కినుక
ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపేసి ఉరివేసుకొని ఆత్మహత్య
నల్లగొండ జిల్లాలో పండుగ పూట విషాదం
కొండమల్లేపల్లి, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): ఫోన్ మాట్లాడిన భర్త.. ఆడిగినా చెప్పకుండా ఆదరబాదరాగా ఇంట్లోంచి వెళ్లిపోవడం, వెతికినా అతడి ఆచూకీ దొరక్కపోవడంతో మనస్తాపానికి గురైన భార్య.. ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో దీపావళి రోజే ఈ విషాదం జరిగింది. కుంచాల రమేశ్, నాగలక్ష్మి(27) దంపతుల స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా జనకవరం. వీరికి పిల్లలు అవంతిక (10), పవన్‌సాయి (8) ఉన్నారు. నాలుగేళ్ల క్రితం రమేశ్ తన కుటుంబంతో కొండమల్లేపల్లికి వచ్చి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇటీవల కొత్తగా పెయింటింగ్ దుకాణం కూడా పెట్టాడు. ఆదివారం సాయంత్రం రమేశ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌చేసింది ఎవరు? అని భర్తను నాగలక్ష్మి ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో రమేశ్ ఇంట్లోంచి వెళ్లిపోయి..ఫోన్ స్విచాఫ్ చేశాడు. భర్త కోసం నాగలక్ష్మి చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆందోళనకు గురైన నాగలక్ష్మి రాత్రి 9:20గంటలకు డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. పోలీసులు నాగలక్ష్మి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి అతడి గురించి వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే నాగలక్ష్మి అదేరోజు రాత్రి తన ఇద్దరు పిల్లలను గొంతునులిమి చంపి.. తాను ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా రమేశ్‌కు గతంలో వేరే మహిళతో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ మహిళతో రమేశ్‌కు ఓ కూతురు ఉంది. ఆ పాప.. రమేశ్ స్వగ్రామంలో నాయనమ్మ వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన రమేశ్ అదే రోజు రాత్రి జనకవరానికి వెళ్లిపోయాడు. భార్య, పిల్లలు చనిపోయారానే విషయాన్ని తెలుసుకొని బంధువుల వెంట సోమవారం రాత్రి కొండమల్లేపల్లికి వచ్చాడు. విగతజీవులుగా ఉన్న ఇద్దరు పిల్లలు, భార్యను చూసి బోరున విలపించాడు.