Extreme Fear of Ants: ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:45 AM
ఆమెకు చీమలంటే జుగుప్స, భయం! చీమల గుంపే కాదు.. ఒక్క చీమ కనిపించినా కెవ్వున కేకపెట్టి బిగుసుకుపోయేది. చివరికి..
లేఖ రాసి పెట్టి వివాహిత బలవన్మరణం
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘటన
చిన్నప్పటి నుంచి ఆమెకు చీమలంటే భయం
వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నా ఫలితం శూన్యం
అమీన్‌పూర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆమెకు చీమలంటే జుగుప్స, భయం! చీమల గుంపే కాదు.. ఒక్క చీమ కనిపించినా కెవ్వున కేకపెట్టి బిగుసుకుపోయేది. చివరికి.. ఆ చీమలతో బతకడం తనవల్ల కాదని.. తమ మూడేళ్ల పాపను జాగ్రత్తగా చూసుకోవాలంటూ భర్తను ఉద్దేశించి ఓ లేఖ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ నరేశ్, మృతురాలి భర్త, ఆమె తల్లిదండ్రులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన శ్రీకాంత్‌కు, ద్యావణపెల్లి మనీషా (25)కు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు మూడేళ్ల పాప అన్నిక ఉంది. ఈ కుటుంబం రెండున్నరేళ్లుగా అమీన్‌పూర్‌లోని నవ్య హోమ్స్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. చీమలంటే జుగుప్స, భయంతో వణికిపోయే ‘మింకాఫోబియా’తో మనీషా బాధపడుతోంది. దీన్నుంచి బయటపడేసేందుకు ఆమెకు వైద్యులతో కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తున్నారు. అయినా నయం కాలేదు. చీమలంటే భయమూ పోలేదు. మంగళవారం సాయంత్రం చిన్నారి అన్నికను కాలనీలో తెలిసిన వారి ఇంట్లో దిగబెట్టి.. ఇంటిని శుభ్రం చేయాల్సి ఉందంటూ మనీషా వెళ్లింది. బయటి నుంచి వచ్చిన భర్త.. ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. గదిలో మనీషా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఆ పక్కనే... ‘అయామ్ సారీ శ్రీ (భర్త).. ఈ చీమలతో బతకడం నావల్ల కాదు. అన్వి (కుమార్తె) జాగ్రత్త. అన్నవరం, తిరుపతి హుండీల్లో రూ. 1116 చొప్పున వేయాలి. ఎల్లమ్మకు ఒడిబియ్యం పోయడం మర్చిపోవొద్దు’ అంటూ మనీషా రాసిన లేఖ లభ్యమైంది. మృతదేహానికి పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదైంది.