Gang Assault: గ్యాంగ్‌రేప్ చేసి కర్రతో కొట్టి హత్య
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:22 AM
కిస్మత్‌పూర్‌లో దారుణహత్యకు గురైన 32 ఏళ్ల మహిళ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఆమెపై దుండగులు సామూహిక..
కిస్మత్‌పూర్ మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
అత్తాపూర్ 143 పిల్లర్ వద్ద మద్యం మత్తులో మహిళ
ఆమెను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసిన డ్రైవర్
ఆ తర్వాత ఆమెపై మరో ఇద్దరి అత్యాచారం.. ముగ్గురి అరెస్టు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కిస్మత్‌పూర్‌లో దారుణహత్యకు గురైన 32 ఏళ్ల మహిళ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఆమెపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి కొట్టి చంపారని విచారణలో తేల్చారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 16న కిస్మత్‌పూర్ వంతెన వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం ఉన్న స్థితిని బట్టి.. ఆమెపై అత్యాచారం చేసి హత్యచేసి ఉంటారని అనుమానించారు. హతురాలిని నాంపల్లిలోని ఆగాపురకు చెందిన గృహిణిగా గుర్తించారు. ఈనెల 14న ఆ మహిళ, ఓ కల్లుకాంపౌండ్‌కు వెళ్లి కల్లు తాగి ఆ మత్తులో పిల్లర్ నంబరు 143 వద్ద కూర్చుంది. లంగర్‌హౌజ్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన మేకా దుర్గారెడ్డి అనే ఆటోవాలా, ఆమెను చూసి తన ఆటోలో బలవంతంగా కూర్చోబెట్టుకున్నాడు. బీరు, బిర్యాని కొనుగోలు చేసి.. ఆమెను ఆటోలో సాతురాయి సమీపంలోని కేఎల్‌సీసీ ఫంక్షన్ హాల్ సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఆరాంఘర్ ఎక్స్ రోడ్డులోని ఫిల్లర్ నంబర్ 306 వద్ద దింపాడు. కొద్దిసేపటికి ఒంటరిగా ఉన్న బాధితురాలిని టోలిచౌకికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు గులాం దస్తగిర్ ఖాన్(26), మహ్మద్ ఇమ్రాన్(25) చూశారు. ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా ఓ అద్దె ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి ఆమెను బుద్వేల్ మీదుగా కిస్మత్‌పూర్ వంతెన వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ చెట్ల పొదల్లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో దస్తగిర్ ఖాన్ బాధితురాలిని కర్రలతో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మృతదేహాన్ని అక్కడి చెట్ల పొదల్లో వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండ్రోజుల తర్వాత మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ముగ్గురూ పాత నేరస్తులేనని.. వివిధ పోలీస్ స్టేషన్లలో వారిపై ఇప్పటికే కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.