Woman brutally attacked: తలపై కుక్కర్‌తో మోది.. కట్టేసి గొంతు కోసి..
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:38 AM
అపార్ట్‌మెంట్లోని వేర్వేరు ఫ్లాట్లలో పనివాళ్లు.. ఓ ఇంట్లో డబ్బు, నగలపై కన్నేశారు.. ఇంట్లోని మహిళ తలపై కుక్కర్‌తో మోది..
కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య
దారుణానికి పాల్పడిందిఆ అపార్ట్‌మెంట్‌లోని పనివారే!
బంగారు నగలు, డబ్బుతో పరారీ!
ఐదు బృందాలతో పోలీసుల గాలింపు
కేపీహెచ్‌బీ కాలనీ/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అపార్ట్‌మెంట్లోని వేర్వేరు ఫ్లాట్లలో పనివాళ్లు.. ఓ ఇంట్లో డబ్బు, నగలపై కన్నేశారు.. ఇంట్లోని మహిళ తలపై కుక్కర్‌తో మోది.. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తర్వాత డబ్బు, నగలతో పారిపోయారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ పవర్ వన్ 13వ అంతస్తులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సనత్‌నగర్‌లో స్టీల్ దుకాణం నిర్వహించే వ్యాపారవేత్త రాకేశ్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్(50), కుమారుడు శుభంతో కలిసి ఎనిమిదేళ్లుగా స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. వారి ఇంట్లో జార్ఖండ్‌కు చెందిన హర్ష పది రోజుల క్రితమే పనికి కుదిరాడు. ఆపై అంతస్తులోని మరొకరి ఇంట్లో రోషన్ కొన్నాళ్లుగా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న ఇళ్లలోనే వారు నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో రాకేశ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వచ్చిన ఆయన ప్లంబర్ సాయంతో ఫ్లాట్ వెనుకవైపు ఉన్న తలుపు లోపలికి వెళ్లారు. రేణు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి హతాశుడయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పనివాళ్లు ఇద్దరూ కనబడకపోవడం, హంతకులు పెద్ద బ్యాగుతో ద్విచక్రవాహనంపై గేటెడ్ కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో హర్ష, రోషన్ ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఆధారాలను బట్టి ప్లాన్ ప్రకారమే హత్య చేసి ఉంటారని.. ప్రెషర్ కుక్కర్‌తో తలపై బాది, కాళ్లు, చేతులు కట్టేసి, కూరగాయల కత్తులతో గొంతు కోసి చంపారని గుర్తించారు. హత్య తర్వాత నిందితులు స్నానం చేసి దుస్తులు మార్చుకున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వెంటనే ఐదు బృందాలతో గాలింపు చేపట్టారు. ఇళ్లలో పనిచేసేందుకు మనుషులను సరఫరా చేసే ఏజెంట్ నుంచి సమాచారం సేకరించారు. బుధవారం రాత్రి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, జార్ఖండ్ నుండి పనికి వచ్చిన రోషన్, హర్ష హత్య చేసినట్టు భావిస్తున్నామని.. వారు ఇళ్లలో పనికి ఎలా కుదిరారు? ఎవరి ద్వారా వచ్చారనే వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ సురేశ్‌కుమార్ తెలిపారు.
భార్యను చంపి.. తీరిగ్గా తాగొచ్చి..
ఇటీవల మేడిపల్లిలో జరిగిన గర్భిణి స్వాతి హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్‌రెడ్డి (27), స్వాతి (21) ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ కొన్ని రోజులకే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. భార్యపై అనుమానం పెంచుకున్న మహేందర్‌రెడ్డి.. గత నెల 23న గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని గదిలోనే ఉంచి తాళం వేసి బయటకు వెళ్లాడు. సాయంత్రం 4:00 వరకు మద్యం తాగాడు. కొన్ని ప్లాస్టిక్ కవర్‌లు, తాడు కొనుక్కుని ఇంటికి వచ్చాడు. భార్య శరీరం నుంచి కాళ్లు, చేతులు, తల ముక్కలు చేసి.. కవర్లలో మూటగట్టి తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. మొండెంను పడేయడానికి పూర్తిగా ప్యాక్ చేశాడు. ఇంతలో నిందితుడి బావ ఇంటికి రావడంతో.. తన భార్య కనిపించడం లేదంటూ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోయాడు. చివరికి పట్టుబడ్డాడు. అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించిన పోలీసులు.. తాజాగా కస్టడీలోకి తీసుకుని, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి ఈ అంశాలను గుర్తించినట్టు తెలిసింది.