Ashwini: నిర్మల్‌లో మహిళ దారుణ హత్య
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:16 AM
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఓ మహిళ సోమవారం దారుణ హత్యకు గురైంది. ఉపాధి కోసం టీ పాయింట్ నిర్వహిస్తున్న సదరు మహిళ ..
సహజీవన భాగస్వామే నిందితుడు
భైంసా, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఓ మహిళ సోమవారం దారుణ హత్యకు గురైంది. ఉపాధి కోసం టీ పాయింట్ నిర్వహిస్తున్న సదరు మహిళ .. ఆమె సహజీవన భాగస్వామి చేతిలో హతమైంది. భైంసా టౌన్ సీఐ గోపినాథ్ కథనం ప్రకారం.. భైంసా మండలంలోని కుంసర గ్రామానికి చెందిన అశ్విని (28)అనే వివాహిత కుటుంబ కలహాలతో భర్త, ఇద్దరు పిల్లలకు కొంత కాలంగా దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భైంసాలోని అంబేడ్కర్ నగర్ కాలనీకు చెందిన నగే్‌షతో ఏర్పడిన పరిచయం, సహజీవనానికి దారితీసింది. ఇద్దరు కలిసి సంతోషీమాత ఆలయ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తూ.. ఉపాధి కోసం టీ పాయింట్ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం టీ పాయింట్ తెరిచిన కొద్ది సమయానికే అశ్విని, నగే్‌షల మధ్య గొడవ తలెత్తింది. అశ్విని వ్యవహర శైలిపై అనుమానం పెంచుకున్న నగేష్.. కత్తి, రాడుతో విచక్షణరహితంగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. అశ్విని రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. నిందితుడు నగేష్ పక్కనే కూర్చొని ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నగే్‌షను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.