Land Dispute: సీఎం ప్రజావాణి వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:10 AM
తమ 3.18 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని, న్యాయం చేయమంటే తమపైనే కేసులు పెట్టారని సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం...
అడ్డుకున్న పోలీసులు, మీడియా సిబ్బంది
బేగంపేట, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తమ 3.18 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని, న్యాయం చేయమంటే తమపైనే కేసులు పెట్టారని సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చిట్యాల గ్రామ వాసి మోక్షమేరి ఆరోపించారు. శుక్రవారం బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమానికి భర్త నాజర్, కొడుకులు ప్రసాద్ రాజ్, దిలీ్‌పలతో కలిసి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజా భవన్‌కు చేరుకున్న మోక్షమేరి మీడియాతో మాట్లాడుతూ.. తాను వెంట తెచ్చుకున్న బాటిల్‌లో పెట్రోల్ తలపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడ ఉన్న పోలీసులు, మీడియా సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు తర్వాత వారిని సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ వద్దకు తీసుకెళ్లి వారి సమస్యను వివరించారు. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన దివ్య దేవరాజన్.. వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. దీంతో సీఎం ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించిన ఆ కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయింది.