Woman Attacked and Robbed: రైల్లో మహిళపై అత్యాచారం
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:57 AM
కదులుతున్న రైల్లోనే ఓ మహిళా ప్రయాణికురాలు అత్యాచారానికి గురైంది. బాధితురాలికి మాయమాటలు చెప్పి మహిళా బోగీలోకి దూరిన దుండగుడు..
బాధితురాలికి మాయమాటలు చెప్పి మహిళా బోగీలో దూరిన దుండగుడు
ఒక్కరే ఉండటంతో కత్తితో బెదిరించి అఘాయిత్యం.. నగదు, ఫోన్‌తో పరార్
సంత్రగచి-చర్లపల్లి స్పెషల్ ట్రైన్‌లో గుంటూరు సమీపంలో ఘటన
సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్ రైల్వేస్టేషన్/ గుంటూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కదులుతున్న రైల్లోనే ఓ మహిళా ప్రయాణికురాలు అత్యాచారానికి గురైంది. బాధితురాలికి మాయమాటలు చెప్పి మహిళా బోగీలోకి దూరిన దుండగుడు.. ఆమె ఒక్కరే ఉండటంతో కత్తి చూపి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆపై దాడి చేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తేరుకునేలోపే ఆమె బ్యాగులో ఉన్న నగదు, మొబైల్ తీసుకొని రైలు దిగి పారిపోయాడు. సోమవారం రాత్రి ఏపీలోని రాజమండ్రి నుంచి బయలుదేరిన సంత్రగచి- చర్లపల్లి స్పెషల్ ట్రైన్‌లో గుంటూరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు మంగళవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించగా వారు.. ఆ మేరకు కేసు (జీరో ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ (35) బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వస్తోంది. నాచారంలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేయాల్సి ఉండగా.. చర్లపల్లిలో దిగేందుకు సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్‌లో సంత్రగచి స్పెషల్ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది. రైలు గుంటూరు స్టేషన్‌కు చేరుకునేసరికి తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోయారు. ఈ క్రమంలోనే రైలు కదులుతుండగా.. సుమారు 40 ఏళ్ల వయసున్న ఆగంతకుడు వచ్చి మిగతా బోగీల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయని తీయమని బతిమాలాడటంతో తీసింది. దీంతో అందులోకి ఎక్కిన దుండగుడు.. 20 నిమిషాల తర్వాత తన వద్దనున్న కత్తి చూపి బెదిరించాడు. దీంతో డబ్బులున్న బ్యాగు, మొబైల్ ఫోన్‌ను అక్కడే వదిలేసిన బాధితురాలు బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకుంది. బ్యాగు కింద పారేస్తానని బెదిరించడంతో ఆమె డోర్ తీసి చూడబోగా బలవంతంగా బాత్రూం బయటకు లాగిన ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదించడంతో బ్యాగులో ఉన్న నగదు రూ.5,600, ఫోన్ తీసుకొని కిందకు దూకి పారిపోయాడు. బాధితురాలు చర్లపల్లిలో దిగి స్టేషన్ సిబ్బందికి జరిగిన విషయాన్ని వివరించగా.. వారి సూచనతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అక్కడి పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం ఏపీలోని నడికుడి పోలీస్ స్టేషన్ పరిధిలోనిది కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
రైళ్లలో భద్రతపై అనుమానాలు..
రైల్లో అత్యాచారం, దోపిడీ ఘటన రైల్వేలో కలకలం రేకెత్తిస్తోంది. ప్రయాణికులకు రైల్వే శాఖ కల్పించే భద్రత ఇదేనా అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన గుంటూరు లాంటి ప్రధాన రైల్వేస్టేషన్‌లో భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. నిబంధనల ప్రకారం మహిళల కోచ్ రైలు వెనుకభాగంలో సిగ్నల్ ఇచ్చే గార్డు కోచ్‌కు ఆనుకునే ఉంటుంది. గుంటూరు స్టేషన్‌లో రైలు బయలుదేరేముందు గార్డు సిగ్నల్ ఇస్తారు. రైలు కదిలే సమయంలోనే ఆగంతకుడు మహిళా కోచ్‌లోకి ఎక్కాడని బాధితురాలు చెబుతున్నారు. మరి ఆ సమయంలో గార్డు ఎందుకు గుర్తించి ఆగంతకుడిని కిందికి దించలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలానే ఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా సంతకం కోసం గుంటూరు స్టేషన్‌లో దిగుతారు. కనీసం వారైనా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఉదయం బయలుదేరాల్సిన రైలు 8 గంటలు ఆలస్యమవ్వడంతో రాత్రి ప్రయాణం కావడంతో దుండగుడికి అనువైన వాతావరణం ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.