Domestic violence: ప్రేమించి పెళ్లాడి చంపేశాడు!
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:12 AM
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిని ఎన్నో ఆశలతో పెళ్లాడిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది....
తాండూరులో వివాహిత దారుణ హత్య
భర్తతోపాటు అత్తమామల దాడి
తాండూరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిని ఎన్నో ఆశలతో పెళ్లాడిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. భర్త, అత్తమామలు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆమె.. పెళ్లయిన ఎనిమిది నెలలకే ఈ లోకాన్ని వీడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కఠన్‌కోట్‌కు చెందిన అనూష(22), తాండూరుకు చెందిన పరమేశ్ ఎనిమిది నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం పరమేశ్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో వారు అనూషను నిత్యం వేధింపులకు గురిచేసేవారు. భౌతిక దాడులకు పాల్పడేవారు. ఇది భరించలేక అనూష ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అనూష, పరమేశ్ మధ్య గొడవలు నాలుగు రోజులుగా మరింత తీవ్రమయ్యాయి. అయితే, పుట్టింటిలో ఉన్న అనూషను పరమేశ్ గురువారం ఉదయం బలవంతంగా తన ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం భర్త, అత్తమామలు చేసిన దాడి వల్ల అనూష అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పరమేశ్ ఆమెను తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో అనూష మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసి పరమేశ్ పరారయ్యాడు. విషయం తెలిసిన అనూష కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనూషను హత్య చేసిన పరమేశ్, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అదనపు కట్నం కోసమే అనూషను వేధింపులకు గురి చేసి చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అనూష భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.