Family Dispute: భర్తను కడతేర్చిన భార్యలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:21 AM
కుటుంబ కలహాలతో క్షణికావేశంతో భర్త మాలవత్ మోహన్(40)ను ఆయన ఇద్దరు భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు....
పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య
భీమ్‌గల్ రూరల్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలతో క్షణికావేశంతో భర్త మాలవత్ మోహన్(40)ను ఆయన ఇద్దరు భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట్‌లో జరిగింది. మోహన్ మొదటి భార్య మాలవత్ కవిత, రెండో భార్య సంగీత ఒకే ఇంట్లో ఉంటున్నారు. ప్రతీ రోజు మద్యం తాగి భార్యలను వేధింపులకు గురిచేస్తుండటంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన మోహన్ తన ఇద్దరు భార్యలను గది లో బంధించాడు. దీంతో మోహన్‌ను హత్య చేయాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం మోహన్ రెండో భార్య సంగీత కిరాణ దుకాణం నుంచి పెట్రోల్ తెచ్చింది. వరండాలో మద్యం మత్తులో కుర్చీలో నిద్రపోతున్న మోహన్‌పై ఇద్దరు భార్యలు పెట్రోల్ పోశారు. పొయ్యిలో మండుతున్న కట్టెతో నిప్పంటించారు. మంటలంటుకుని మోహన్ అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు భార్యలు పరారయ్యారు. మృతుడి బంధువు మాలవత్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి మొదటి భార్యకు ముగ్గురు కూతుళ్లు, రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.