Share News

తీరు మారేనా..?

ABN , Publish Date - May 13 , 2025 | 12:18 AM

రెవెన్యూ శాఖలో రైతుల భూములకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నాయి.

తీరు మారేనా..?

అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై వేటు

రికార్డులను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు

అక్రమాలకు పాల్పడ్డ వారిపై కేసులు, సస్పెన్షన్లు

ఉన్నతాధికారులు హెచ్చరించినా ఫలితం శూన్యం

రెవెన్యూ అధికారుల్లో మార్పు వచ్చేనా

రెవెన్యూ శాఖలో రైతుల భూములకు సంబంధించిన సమస్యలు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నాయి. వాటి పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల భూసమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. భూసమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. డబ్బులిస్తేనే భూరికార్డులను సరి చేస్తామని రైతుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు రైతులు డబ్బులు ఇవ్వకపోవడంతో వారి రికార్డులను సరి చేయకుండా కావాలని జాప్యం చేశారని విమర్శలూ వచ్చాయి. బాధిత రైతులు అప్పట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు లు చేశారు. ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినా కొంతమంది రెవెన్యూ అధికారుల తీరు మారడంలేదు.

- (ఆంధ్రజ్యోతి)- సూర్యాపేట(కలెక్టరేట్‌)

జిల్లాలోని కొంతమంది తహసీల్దార్లు మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు, ధరణి ఆపరేటర్ల ద్వారా లంచా లు తీసుకుటున్నట్లు సమాచారం. భూరికార్డుల ప్రక్షాళన, సాదాబైనామా, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కొంతమంది అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పాస్‌ పుస్తకాల్లో ఇంటి పేర్లు తప్పడం, విస్తీర్ణంలో తప్పులు ఉండడం, పలువురికి హద్దులు సరిగా లేకపోవడం వల్ల సవరణ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నారు. కొన్ని ఆన్‌లైన్‌లో కూడా తప్పులు నమోదవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కావాలనే డబ్బుకు ఆశపడిన రెవెన్యూ సిబ్బంది రికార్డులను తప్పుల తడకగా మార్చారు. దీని వలన గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉంటున్నాయి. భూరికార్డుల ప్రక్షాళన లో మిగిలిన పెండింగ్‌ సమస్యలు పరిష్కరించేందు కు రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని అమలుల్లోకి తీసుకురానుంది. ఇప్పటికే దీనిపై మండల స్థాయి, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. భూభారతి చట్టం అమలులోకి రాగానే రెవెన్యూ అధికారులు, సిబ్బంది భూ భాగోతాలు ఒక్కొక్కటిగా బహిర్గతం కానున్నాయి. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌ ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆయా మండలాల్లో ఇంకా అధికారులు, సిబ్బంది అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఎంతమందిపై వేటు పడుతుందో వేచి చూడాల్సి ఉంది.

సంఘటనలెన్నో..

జిల్లాలో రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బందిపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌ ఇటీవల చర్యలు చేపట్టా రు. భూరికార్డుల విషయంలో కొంతమంది రైతుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేయడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ ఏకం గా ప్రభుత్వ భూమిని ధరణి ఆపరేటర్‌తో కలిసి కొం తమంది ఇతరుల పేర్ల మీదకి మార్చారు. దానికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశా రు. ఈ విషయం బయటకు తెలియడంతో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్‌తో పాటు ధరణి ఆపరేటర్‌తో పాటు రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెండ్‌ చేశారు. దీం తో పాటు మోతె మండలంలోని రాఘవపురం, నామవరం రెవెన్యూ శివారులోని పలు సర్వే నెంబర్ల లో భూమి లేనప్పటికి ఉన్నదాని కంటే అదనంగా రికార్డుల్లో నమోదు చేసి అక్రమంగా పాస్‌పుస్తకాలు జారీ చేసిన విషయంలో మోతె తహసీల్దార్‌తో పాటు డీటీ, ఇద్దరు ఆర్‌ఐలు, మీసేవ కేంద్రం నిర్వహకుడు, పలువురు రైతులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించారు. రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేశారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని నెమ్మికల్‌ శివారులో వివాదంలో ఉన్న భూమికి సంబంధించి అక్రమంగా ఇతరుల పేరు నమోదు చేసిన విషయంలో విచారణ చేయించి బాధ్యులైన డీటీ, ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్‌లను సస్పెండ్‌ చేయడంతో పాటు తహసీల్దార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీసీఎల్‌ఏకు సిఫారసు చేశారు. కొందరు తహసీల్దార్లు, ఆర్‌ఐలు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లోని ధరణి ఆపరేటర్లు ధీర్ఘ కాలికంగా ఒకేచోట పనిచేస్తుండడంతో అవినీతి, అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని భావించి వారందరినీ బదిలీ చేశారు.

అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదు

రైతుల భూసమస్యలకు సంబంధించి అవినీతి, అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదు. ఇప్పటికే జిల్లాలో కొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బందిని సస్పెండ్‌ చేశాం. పెండింగ్‌లో ఉన్న రైతుల భూసమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించి పరిష్కరిస్తున్నాం. త్వరలో భూభారతి చట్టం అమలులోకి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అధికారులు విధి నిర్వహణలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే క్షమించేది లేదు.

- తేజస్‌ నందలాల్‌ పవార్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌.

Updated Date - May 13 , 2025 | 12:18 AM