భూసమస్యలు పరిష్కారమయ్యేనా?
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:45 AM
భూభారతి 2025 చట్టం ద్వారా భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయని మండల రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
భూసమస్యలు పరిష్కారమయ్యేనా?
భూభారతిపైనే ఆశలు
ధరణితో ఇబ్బందులు పడిన భూ యజమానులు
రెవెన్యూ సదస్సుల్లో 1500 దరఖాస్తులు
చందంపేట, జూన 23 (ఆంధ్రజ్యోతి): భూభారతి 2025 చట్టం ద్వారా భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయని మండల రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ధరణితో వందలాది మంది రైతులు తమ భూములు కోల్పోవడం, రికార్డులో భూమి ఉండి ధరణి పోర్టల్‌లో భూమి చూపించకపోవడం కారణంగా 2019 నుంచి రైతులు రైతుబంధు, క్రాప్‌లోన వంటి పథకాలకు దూరమయ్యారు. కంబాలపల్లి, పొగిళ్ల, చిత్రియాల, పెద్దమూల రైతులు నాగార్జునసాగర్ ముంపు బాధితులు అప్పటి ప్రభుత్వం ముంపు ప్రాంత ప్రజలకు డీఫారెస్ట్ భూములకు రైతులకు పట్టాలు ఇచ్చారు. 2019 ధరణి చట్టం వచ్చాక ధరణి పోర్టల్‌లో డి.ఫారెస్ట్ భూములను రైతులు కోల్పోయారు. దీంతో అటు అటవీశాఖ అధికారులు, ఇటు రైతులకు గొడవలు జరిగిన సంఘటనలు మండలంలో అనేకం ఉన్నాయి. పెద్దమూల, కంబాలపల్లి గ్రామాల్లో దాడులు జరిగిన సంఘటనలతో కేసులు కూడా నమోదయ్యాయి. అటు రైతులకు, ఇటు ఫారెస్ట్ అధికారులకు మధ్య రెవెన్యూ అధికారులు సమస్యకు పరిష్కారం చూపలేని సంఘటనలు అనేకం ఉన్నాయి. ధరణి చట్టం అమలులోకి వచ్చే ముందు అప్పటి వీఆర్‌వోలు చేతివాటం ప్రదర్శించి అనేక మంది రైతుల భూరికార్డులను తారుమారు చేశారు. దీంతో భూమి ఆనలైనలో ఒకరు, భూమి అనుభవదారులు మరొకరుగా మారారు. ఇటువంటి సమస్యలు మండలంలో అనేకం ఉన్నాయి. ఆ భూసమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దుచేసి భూభారతి చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్ట రూపకర్త సునీల్ కొనుగోలు భూభారతి అవగాహన కార్యక్రమాన్ని కంబాలపల్లిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో మండలంలోని భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 2 నుంచి 13వ తేదీ వరకు ప్రభుత్వం మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను ఫిర్యాదుల రూపంలో స్వీకరించారు. మండలంలోని 29 గ్రామపంచాయతీల నుంచి 1500 ఫిర్యాదులు రావడం మండలంలోని భూసమస్యలకు అద్దం పడుతుంది. భూభారతి 2025 చట్టంతోనైనా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి న్యాయం జరుగుతుందని ఈ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దశలవారీగా సమస్యలు పరిష్కారం
మండలంలో ఈ నెల 2 నుం చి 13వ తేదీ వరకు అన్ని గ్రామపంచాయతీల్లో రెవె న్యూ సదస్సులు నిర్వహిం చాం. ఈ సదస్సుల్లో రైతుల నుంచి 1500 దరఖాస్తులు స్వీకరించాం. ఈ దరఖాస్తులను గ్రామపంచాయతీవారీగా ఆగస్టు 14వ తేదీ లోపు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ లోపు మాపరిధిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తాం.
- శ్రీధర్‌బాబు, తహసీల్దార్, చందంపేట