Life Imprisonment: భర్తను హత్య చేసిన భార్యకు యావజ్జీవ జైలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:11 AM
మద్యంలో విషం కలిపి భర్తను హత్యచేసిన కేసులో భార్యకు యావజ్జీవ జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ నల్లగొండ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది...
మద్యంలో విషం కలిపినట్టు నిర్ధారణ
నల్లగొండ క్రైం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యంలో విషం కలిపి భర్తను హత్యచేసిన కేసులో భార్యకు యావజ్జీవ జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ నల్లగొండ న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించకపోతే మరో నాలుగు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. జిల్లా రెండో అదనపు జిల్లా జడ్జి; ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి రోజారమణి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామపంచాయతీ పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(55), లలిత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. కొంత కాలంపాటు ఆమె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉండేది. ఈ క్రమంలో పలుమార్లు తండాలో కులపెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. దాంతో కొన్నాళ్లపాటు భర్తతో ఉండి తిరిగి ప్రియుడి వద్దకు వెళ్లేది. ఈ క్రమంలో భర్త తనను వేధిస్తున్నాడని సరూర్‌నగర్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా భర్త తనను కాపురానికి రమ్మని పదేపదే పిలుస్తుండటంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. 2021 డిసెంబరు 29న రాత్రి పెద్దతండాలో ఉంటున్న భర్త వద్దకు వచ్చింది. భోజనానికి ముందు భర్తకు మద్యం ఇచ్చింది. దాంట్లో అంతకుముందే విషాన్ని కలిపింది. ఈ విషయం తెలియని మోతీలాల్ దాన్ని తాగి నిద్రలోనే మృతిచెందాడు. అనుమానం వచ్చిన అతని సోదరుడు శివరాం వదిన లలితను నిలదీయగా, తానే హత్యచేశానని అంగీకరించింది. దీనిపై దేవరకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాలు సమర్పించడంతో కోర్టు శిక్ష విధించింది.