Share News

Domestic Violence: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..భర్తను కడతేర్చిన భార్య ?

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:52 AM

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ భార్య తన భర్తను హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది...

Domestic Violence: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..భర్తను కడతేర్చిన భార్య ?

  • తలపై కర్రతో రక్తం వచ్చేలా కొట్టి.. శవాన్ని బాత్రూమ్‌ వద్ద పడేసి..

  • ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కుటుంబసభ్యులను నమ్మించే యత్నం

  • పోలీసుల అదుపులో నిందితురాలు

సరూర్‌నగర్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ భార్య తన భర్తను హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి నిజం బయటపడడంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో మీర్‌పేటలోని జిల్లెలగూడ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్లంపల్లి విజయ్‌కుమార్‌ (42), సంధ్య దంపతులు స్థానిక ప్రగతినగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లల సంతానం. విజయ్‌కుమార్‌ ఆటో నడుపుతుండగా, సంధ్య మీర్‌పేట మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. సంధ్య కొంతకాలంగా తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇటీవల విజయ్‌కుమార్‌ తన కుటుంబసభ్యులతో కలిసి మునిసిపల్‌ కార్యాలయంలో సదరు ఉద్యోగిని హెచ్చరించినట్లు సమాచారం. దాంతో భర్త మీద కోపం పెంచుకున్న సంధ్య.. ఎలాగైనా అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈ నెల 20న (సోమవారం) విజయ్‌కుమార్‌ మెడకు నీళ్లు తోడే బక్కెట్‌కు కట్టిన తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. తలపై కర్రతో రక్తం వచ్చేలా కొట్టి శవాన్ని బాత్రూమ్‌ వద్ద పడేసి.. ప్రమాదవశాత్తు కిందపడినట్లు కుటుంబసభ్యులను తెలిపింది. వెంటనే వారు డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతుండగా, బక్కెట్‌ తాడుకు రక్తం ఉండడాన్ని గమనించిన మృతుడి తల్లి సత్తెమ్మ, స్థానికులు అనుమానం వచ్చి మీర్‌పేట్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో మెడకు తాడు బిగించి హత్య చేసినట్లుగా తేలడంతో సంధ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.

Updated Date - Oct 27 , 2025 | 01:52 AM