Share News

Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:37 AM

ప్రియుడితో కలిసి భర్తను గొంతు బిగించి చంపిన ఆ భార్య, గుండెపోటుతో మృతిచెందాడని అందర్నీ నమ్మించేందుకు విఫలయత్నం చేసింది...

Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

  • గుండెపోటుగా చిత్రీకరించేందుకు యత్నం

  • మేడిపల్లిలో ఘోరం.. ముగ్గురి అరెస్టు

పీర్జాదిగూడ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రియుడితో కలిసి భర్తను గొంతు బిగించి చంపిన ఆ భార్య, గుండెపోటుతో మృతిచెందాడని అందర్నీ నమ్మించేందుకు విఫలయత్నం చేసింది. మేడిపల్లి పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వీకే అశోక్‌ (45), పూర్ణిమ (36) దంపతులు. వీరికి పన్నెండేళ్ల క్రితం పెళ్లయింది. ఓ కుమారుడు (11) ఉన్నాడు. ఈ కుటుంబం బోడుప్పల్‌ బృందావన్‌ కాలనీలో నివాసం ఉంటోంది. అశోక్‌ ప్రైవేటు వర్సిటీలో పనిచేస్తున్నాడు. పూర్ణిమ ఇంటివద్దే ఉంటూ పిల్లలకు ట్యూషన్లు చెబుతోంది. గత ఏడాది అదే కాలనీకి చెందిన పాలేటి మహేశ్‌ (22)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంఽధానికి దారి తీసింది. పూర్ణిమ తీరును అనుమానించిన భర్త.. ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. భర్తను హత్యచేస్తే తమకు అడ్డుచెప్పేవారెవరూ ఉండరని తలపోసిన పూర్ణిమ.. ప్రియుడు మహేశ్‌తో కలిసి నెల క్రితమే పథకం వేసి, అవకాశం కోసం ఎదురుచూడసాగింది. మరోవైపు.. అశోక్‌ను చంపేందుకు సాయం చేయాలని తన స్నేహితుడు సాయికుమార్‌ (22)ను మహేశ్‌ కోరగా అతడు ఓకే చెప్పాడు. వెంటనే సాయుని మహేశ్‌ బోడుప్పల్‌కు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో 11వ తేదీ మధ్యాహ్నమే మహేశ్‌, సాయి కలిసి పూర్ణిమ ఇంటికొచ్చి ఓ గదిలో నక్కారు. సాయంత్రం ఆరింటికి అశోక్‌ ఇంటికి రాగానే.. పూర్ణిమ, మహేశ్‌, సాయి కలిసి కాళ్లు, చేతులు కదపకుండా పట్టుకొని చున్నీతో మెడకు ఉరివేసి హత్య చేశారు. అనంతరం తన భర్త గుండెపోటుతో మృతిచెందాడంటూ పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టంలో గొంతుకు ఉరి బిగించడంతోనే అతడు మరణించినట్లు తేలడంతో పూర్ణిమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె అంతా పూసగుచ్చినట్లు వివరించింది. పూర్ణిమ, మహేశ్‌, సాయికుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Dec 23 , 2025 | 04:37 AM