Widespread Cyber Scams: ఫేక్.. ఫేక్!
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:24 AM
రూ.22 వేల పెట్టుబడి పెట్టండి.. మీరు లక్షాధికారులైపోతారు. మరుసటి రోజు నుంచే మీకు రోజుకు రూ.64 వేలు వస్తాయి....
రూ.22 వేలు పెడితే 10 లక్షల సంపాదన..!
కేంద్ర మంత్రి నిర్మల పేరుతో ఏఐ వీడియోలు
అడ్డంగా దోపిడీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
నిరుద్యోగ భృతి పేరుతో ప్రధాని ఫేక్ సందేశాలు
దేశవ్యాప్తంగా మోసపోయిన వేల మంది!!
చర్యలు తీసుకోవడంలో కేంద్ర ఐటీ శాఖ విఫలం?
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘‘రూ.22 వేల పెట్టుబడి పెట్టండి.. మీరు లక్షాధికారులైపోతారు. మరుసటి రోజు నుంచే మీకు రోజుకు రూ.64 వేలు వస్తాయి. నెలకు అలా రూ.10 లక్షల వరకు సంపాదించవచ్చు’’.. ఈ ప్రకటన చేసిందెవరో కాదు..! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అని నమ్మించేలా సైబర్ కేటుగాళ్లు ఆమె ఏఐ వీడియోను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో ‘పెయిడ్ కంటెంట్’గా సర్క్యులేట్ చేస్తూ.. అమాయకుల పుట్టి ముంచుతున్నారు. ఆ వీడియో పక్కనే పెట్టుబడి ఎంత పెట్టాలి? రోజుకు, నెలకు లాభాలెంత? అనే లెక్కలతోపాటు.. భారతీయ స్టేట్ బ్యాంక్(ఎ్‌సబీఐ) ఆమోదించిందంటూ సైబర్ నేరగాళ్లు యాడ్స్‌ను సృష్టించారు. 10 నెలలుగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. స్వయానా కేంద్ర ఆర్థిక మంత్రే చెప్పారు కదా? అది నిజమే అయ్యి ఉంటుందని దేశవ్యాప్తంగా వేల మంది రూ.22 వేల చొప్పున చెల్లించి, మోసపోయారు. కేటుగాళ్లు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఏఐ ద్వారా అడ్డంగా వాడేసుకుంటున్నారు. ‘‘మా ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ.3,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వబోతోంది. రూ.1,000 చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు’’ అని మోదీ అన్నట్లుగా ఉన్న నకిలీ ఆడియో, వీడియోలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అలాగే, ‘‘మేం త్వరలో రూ.వేల కోట్లతో ఆన్‌లైన్ ప్రాజెక్టు చేపడుతున్నాం. ప్రజలు కూడా తమ స్థాయికి తగ్గట్లు పెట్టుబడులు పెట్టి, భాగస్వాములు కావొచ్చు’’ అంటూ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పేరుతోనూ ఏఐ ఆధారిత వీడియో ఒకటి ప్రచారంలో ఉంది. అంతేనా? ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, ఆయన భార్య, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సుధామూర్తి చెప్పినట్లుగా కూడా ఏఐ వీడియోలు ‘పెయిడ్ కంటెంట్’ కింద సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ‘‘క్వాంటమ్ ఏఐ, స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టండి.. రోజుకు రూ.2.5 లక్షలు సంపాదించండి’’ అంటూ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చెప్పినట్లుగా ఉన్న వీడియోను నమ్మి, చాలా మంది మోసపోయారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ పేరుతోనూ ఇలా ఏఐ వీడియోలను సైబర్ కేటుగాళ్లు అప్‌లోడ్ చేస్తూ.. అమాయకులను నిలువుదోపిడీ చేస్తున్నారు.\
అడ్డుకట్ట వేసేదెవరు?
సైబర్ నేరగాళ్ల దందాకు అడ్డుకట్ట వేయాలంటే.. కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ రంగంలోకి దిగాల్సిందే. ఎందుకంటే.. రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయడానికి, నేరస్థులు లభిస్తే.. వారి నుంచి స్వాధీనం చేసుకునే మొత్తాన్ని బాధితులకు తిరిగి ఇవ్వడం వరకే పరిమితమవుతారు. ఐటీ సవరణ చట్టం ప్రకారం.. ఈ తరహా మోసాలకు కేంద్ర ఐటీశాఖ మాత్రమే చర్యలు తీసుకోగలదు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బాధితులు మోసపోతున్నా.. సైబర్ నేరగాళ్ల మోసాలపై కేసులు నమోదవుతున్నా.. కేంద్ర ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు అంతంతమాత్రమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలను నియంత్రించే ఆయుధం కేంద్ర ఐటీ శాఖ వద్ద ఉన్నా.. పీఐబీ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేయించి, చేతులు దులుపుకొన్నారే తప్ప.. చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
అనుమానించడం మంచిది
‘‘తక్కువ పెట్టుబడి.. ఎక్కువ మొత్తంలో లాభం’’ అనే ప్రకటనలు కనిపించిన వెంటనే.. వాటిని అనుమానించాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఏఐ యుగంలో ఎన్నెన్నో మోసాలు పెరిగాయని గుర్తుచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ‘పెయిడ్ కంటెంట్’ వద్ద ‘స్పాన్సర్డ్’ అని చిన్నగా ఉంటుందని, అలాంటి వాటిని గుర్తించాలంటున్నారు. సైబర్ నేరగాళ్ల ప్రకటనలు నిజమేనా? అని గూగుల్‌లో నిర్ధారించుకోవచ్చని చెబుతున్నారు.