Bandhi Sanjay: ఆ 3 కేసులను సీబీఐకి ఎందుకివ్వరు
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:12 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంలో, ఫార్ములా ఈ రేస్‌లో అవకతవకలు, ఫోన్ ట్యాపిం గ్ కేసుల్లో సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని...
గొర్రెల స్కాం బాధ్యులపై చర్యలేవీ?
రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ ప్రశ్న
డైలీ సీరియల్‌లా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తున్నారని విమర్శ
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంలో, ఫార్ములా ఈ రేస్‌లో అవకతవకలు, ఫోన్ ట్యాపిం గ్ కేసుల్లో సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అవకతవకలపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చింది కదా? దాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’ అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆధారాలను సీబీఐకి ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘గొర్రెల స్కాంలో వందల కోట్ల అవినీతి బయటపడ్డా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలను ఎందుకు జైలుకు పంపడం లేదు? వాళ్ల ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? ఫార్ములా ఈ రేస్ స్కాం పేరుతో ప్రతిసారి ‘ట్విటర్ టిల్లు’ను విచారణకు పిలిచి డ్రామాలాడుతున్నారే తప్ప చర్యలేవీ? అవినీతి జరిగిందని మీరే అనేకసార్లు చెప్పారు కదా? ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ స్కాంలో విదేశీ సంస్థ పాత్ర ఉంది కదా? మరి ఈ కేసును సీబీఐ విచారణ ఎందుకు ఇవ్వడం లేదు?’ అని సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును రెండేళ్ల నుంచి డైలీ సీరియల్‌లా సాగదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని ఆయన విమర్శించారు.