Share News

అక్రమ తవ్వకాలను అడ్డుకునేవారేరీ?

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:59 AM

మండలంలో భూబకాసురులు రెచ్చిపోతు న్నారు. కొందరు అధికారులు, ప్రజాప్రతి నిధుల అండదండ లతో మట్టిని ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నారు.

అక్రమ తవ్వకాలను అడ్డుకునేవారేరీ?
చెర్వుతండాలోని ప్రభుత్వ భూమిలో ఎక్స్‌కవేటర్లతో మట్టిని తవ్వి టిప్పర్లలో నింపుతున్న దృశ్యం

పాలకవీడు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో భూబకాసురులు రెచ్చిపోతు న్నారు. కొందరు అధికారులు, ప్రజాప్రతి నిధుల అండదండ లతో మట్టిని ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నారు. పాలకవీడు మండలంలోని చెర్వుతండాలోని ప్రభుత్వ భూమి సర్వే నెం.139 నుంచి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. మండలంలో జానపహాడ్‌ చెర్వులో గ్రామానికి చెందిన ఒక రైతు గత ఎండాకాలంలో సుమారు రెండు వేల ట్రిప్పుల నల్లమట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా డంప్‌ చేశారు. ఈ మట్టిని దిర్శించర్ల గ్రామపంచాయతీ పరిధిలో ఇటుక బట్టీలకు లారీల ద్వారా రేయిబ వళ్లూ తరలిస్తున్నారు. ఒక్కో టిప్పరు మట్టి లోడు సుమారు రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. మట్టిని తరలిస్తూ అక్కమార్కులు సొమ్ము చేసుకుంటున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాను ఆరికట్టాలని కోరుతున్నారు.

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

ప్రభుత్వ భూములు, చెర్వుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పొలాల్లో డంప్‌ చేసిన మట్టిని అక్రమంగా తరలించే వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు యజమానుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

కమలాకర్‌, తహసీల్దార్‌

Updated Date - Apr 29 , 2025 | 01:59 AM