Share News

Minister N. Uttam Kumar Reddy: ఎవరి తోలు ఎవరు తీయాలి?

ABN , Publish Date - Dec 24 , 2025 | 05:53 AM

కృష్ణా బేసిన్‌ వెంట నివసిస్తున్న ప్రజలు, క్యాచ్‌మెంట్‌ ఏరియా ఇలా అన్ని లెక్కలు చూసుకొని నదీ జలాల్లో 70ు వాటా కావాలని మేం కోరుతున్నాం....

Minister N. Uttam Kumar Reddy: ఎవరి తోలు ఎవరు తీయాలి?

  • కృష్ణా జలాల్లో మోసం చేసిందెవరు?.. రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్‌ సహకరిస్తే మేం అడ్డుకున్నాం

  • పాలమూరు ప్రాజెక్టు కన్నా కాళేశ్వరంను ఎందుకు ముందు చేపట్టారు?: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘కృష్ణా బేసిన్‌ వెంట నివసిస్తున్న ప్రజలు, క్యాచ్‌మెంట్‌ ఏరియా ఇలా అన్ని లెక్కలు చూసుకొని నదీ జలాల్లో 70ు వాటా కావాలని మేం కోరుతున్నాం. ట్రైబ్యునల్‌లోనూ ఇవే వాదనలు వినిపిస్తున్నాం. కృష్ణ్ణా జలాల్లో మోసం, ద్రోహం చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. ఉమ్మడి ఏపీలో ఆ ప్రాంతానికి తరలించిన నీటికన్నా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా ఏపీ అక్రమంగా తరలించిన జలాలే అధికం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చే సేందుకు బీఆర్‌ఎస్‌ సహకరిస్తే.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును అడ్డుకున్నాం. ఎవరి తోలు ఎవరు తీయాలి’’ అని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సచివాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉంటే.. బడ్జెట్‌ రూ.17.72 లక్షల కోట్లు కాగా, నీటిపారుదల శాఖపై వెచ్చించింది రూ.1.83 లక్షల కోట్లు అని చెప్పారు. ఇంత ఖర్చుపెట్టి ఒక్క ప్రాజెక్టునైనా పరిపూర్ణంగా పూర్తి చేసి, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చారా..? అని నిలదీశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ఠి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంచుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. హరీశ్‌ రావుకు అలాంటి అలవాట్లు ఉన్నాయని, ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో అందరికీ తెలుసన్నారు. రూ. 7 వేల కోట్లకు సంబంధించిన ప్రతిపైసాకు లెక్క చెబుతామని తెలిపారు. వాళ్ల పదేళ్ల పాలనలో ప్రాజెక్టులపై చేసిన రూ.1.83 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సవరించిన అంచనా వ్యయం రూ.55,086 కోట్లు అని, అందులో రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, ఏ విధంగా 90ు పనులు చేసినట్లు అని ప్రశ్నించారు.


అవన్నీ పెండింగ్‌ ప్రాజెక్టులే!

బీఆర్‌ఎస్‌ పదేళ్లు అఽధికారంలో ఉండగా.. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌లు పెండింగ్‌ ప్రాజెక్టులుగానే ఉన్నాయని ఉత్తమ్‌ పేర్కొన్నారు. రూ.1600 కోట్లు వెచ్చించి ఉంటే.. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని, కేసీఆర్‌ అధికారంలో నుంచి దిగేదాకా అవి పెండింగ్‌ ప్రాజెక్టులాగానే మిగిలిపోయాయన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కన్నా ముందే పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టగా.. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు పెట్టి.. పాలమూరులో రూ.27 వేల కోట్లు మాత్రమే ఎందుకు వెచ్చించారని నిలదీశారు. ఆ ప్రాజెక్టులో జరిగినంత వేగంగా, పాలమూరులో పనులు ఎందుకు వేగంగా జరుగలేదని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వానికి సహకారం అందించండి

కాళేశ్వరం బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు చేయడానికి కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)కు అవసర మైన సహకారాన్ని అందించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్మాణ సంస్థలను కోరారు. మంగళవారం సచివాలయంలో మేడిగడ్డ నిర్మా ణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ, సుందిళ్ల నిర్మాణ సంస్థ నవయుగతో పాటు సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు చెంది న ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం క ట్టుబడి ఉందని, పరీక్షలన్నీ పూర్తిచేసి, 2026లోనే బ్యారేజీలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామని ఉత్తమ్‌ తెలిపారు. తక్షణమే పరీక్షల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించగా.. ఎల్‌ అండ్‌ టీ, నవయుగ సంస్థలు అంగీకరించాయి.

Updated Date - Dec 24 , 2025 | 05:53 AM