Share News

kumaram bheem asifabad- ఎక్కడి చెత్త అక్కడే

ABN , Publish Date - Dec 28 , 2025 | 10:15 PM

కాగజ్‌నగర్‌ మున్సిపాలిలీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన ఐదు నెలల జీతాల చెల్లించాలని కొన్ని రోజులుగా సమ్మె బాట పట్టారు. 30 వార్డుల్లో పారిశుధ్య పనులు నిత్యం జరుగక పోవడంతో ఎటు చూసినా చెత్తాచెదారంతో నిండి పోయి కన్పిస్తోంది. పలు కాలనీలు కంపు కొడుతున్నాయి. ఇంటి వద్దకు వచ్చి నిత్యం చెత్తను తీసుకెళ్లే వాహనాలు కూడా రావడం లేదు.

kumaram bheem asifabad- ఎక్కడి చెత్త అక్కడే
కాగజ్‌నగర్‌లో వార్డుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం

- వార్డుల్లో పేరుకు పోతున్న చెత్తాచెదారం

కాగజ్‌నగర్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపాలిలీలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన ఐదు నెలల జీతాల చెల్లించాలని కొన్ని రోజులుగా సమ్మె బాట పట్టారు. 30 వార్డుల్లో పారిశుధ్య పనులు నిత్యం జరుగక పోవడంతో ఎటు చూసినా చెత్తాచెదారంతో నిండి పోయి కన్పిస్తోంది. పలు కాలనీలు కంపు కొడుతున్నాయి. ఇంటి వద్దకు వచ్చి నిత్యం చెత్తను తీసుకెళ్లే వాహనాలు కూడా రావడం లేదు. దీంతో ఇంటి వద్దనే చెత్తను పెట్టుకుంటున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీలో 196 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెల జీతం రూ.16,600, ఇందులోంచి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ కోసం రూ.2వేలు కోత విధిస్తున్నారు. ప్రతి నెలా జీతాలు చెల్లించక పోవడంతో కుటుంబా ల పోషణకు కార్మికులు అవస్థలు పడుతున్నారు. జనరల్‌ ఫండ్‌ నుంచి వీరికి ప్రతి నెలా జీతాల చెల్లింపులు చేస్తున్నారు. జనరల్‌ ఫండ్‌లో నిధులు పట్టణంలోని ఆస్తి పన్ను బకాయిలు, నీటికుళాయిలు, ట్రేడ్‌ లైసెన్సు డబ్బులు సేకరిస్తున్నారు. మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికులు 196కి గానూ ప్రతి నెలా జీత భత్యాలు రూ.32,34,000 చెల్లించనున్నారు. సాలీనా రూ.3,88,08,000 మేర డబ్బులు చెల్లించాల్సి ఉంది. మున్సిపల్‌ ఆస్తి పన్ను రూ.3 కోట్ల మేర ఉంది. ఆస్తి పన్ను, ఇతరాత్ర వసూలు చేసినప్పటికీ కూడా వీరి జీత భత్యాలకే సరి పోని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెలా ఆస్తి పన్ను వసూలు కాక పోవటం వీరి జీతాలు పెండింగ్‌లో పడే స్థాయికి వచ్చింది. కాని ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి పనుల కోసం వచ్చిన నిధులను వీరి జీతాలకు వినియోగిస్తున్నారు. గత నెలల నుంచి జీతాల చెల్లించక పోవడంతో పూట గడవని పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల నుంచి అప్పులు తెచ్చుకొని కాలం గడుపుతున్నారు. వేతనాల నుంచి కట్‌ చేసిన రూ.2వేలు ఈఎస్‌ఐ, జీపీఎఫ్‌ కార్పొరేషన్‌కు నెల నెలా చెల్లింపులు సైతం నిలిచిపోయాయి. ఇప్పటికీ రూ.1.50 కోటి కట్టాల్సి ఉంది. ఈఎస్‌ఐ డబ్బులు సక్రమంగా చెల్లించక పోవడంతో ఈఎస్‌ఐ ఆసుపత్రిలో రెఫర్‌ కేసులు చేయ లేని పరిస్థితి ఏర్పడింది. తమకు వచ్చిన జీతంలోంచి కోత విధిస్తుండగా, డబ్బులు ప్రతి నెలా కార్పొరేషన్‌కు చెల్లింస్తే తమకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఒక వైపు జీతాలు రాక, మరో వైపు కుటుంబాన్ని పోషించ లేక అవస్థలు పడుతున్నారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఇంత వరకు పరిష్కరించడం లేదని అన్నారు. ఉన్నతాధికారులు తమకు పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.

ఐదు నెలలుగా వేతనాలు లేవు..

- శంకర్‌, కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి

మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు లేవు. జీతాలు లేక పోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. ఇక్కడికి వస్తే రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. అందుకే సమ్మె బాట పట్టాం. తమ జీతాల సమస్య పరిష్కరించేంత వరకు కూడా సమ్మెని నిలిపివేయం. పిల్లలు ఫీజులు కట్టలేదు. త్వరంలో సంక్రాంతి పండుగ ఉంది. ఏమీ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలి.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

-రాజేందర్‌, కాగజ్‌నగర్‌ మునిసిపల్‌ కమిషనర్‌

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికుల జీతాల సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. నిధులు రాగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తాం.

Updated Date - Dec 28 , 2025 | 10:15 PM