Jawaharnagar Model School Students: మాకు రక్షణ ఏదీ
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:02 AM
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ మోడల్ స్కూల్ విద్యార్థినులు శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల ఆందోళన
ప్రహరీ లేదు.. బాత్‌రూంలకు తలుపుల్లేవు
రాత్రి హాస్టల్ ఎదుట రోడ్డుపై బైఠాయింపు
అదే సమయంలో ఆకతాయిల బెదిరింపులు
డీఈవో విచారణ.. ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
వెంకటాపూర్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ మోడల్ స్కూల్ విద్యార్థినులు శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో అనేక సమస్యలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సమస్యలను చెబితే సిబ్బంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు రాత్రివేళల్లో హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పా రు. బాత్‌రూంలకు తలుపులు, మంచాలు లేవని తెలిపారు. ఈ హాస్టల్‌లో 50 మంది విద్యార్థినులు ఉంటున్నారు. సుమారు 30 మంది శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హాస్టల్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. మిగతా 20 మంది హాస్టల్‌లోనే ఉండి చదువుకుంటున్నారు. ఈ క్రమంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు హాస్టల్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని హల్‌చల్ చేశారు. ‘మీ ఎస్‌వో మమ్మల్ని పంపింది. డోర్ తీయండ’ని గద్దించారు. ‘వీళ్లు డోర్ తీస్తలేరు.. గన్స్ తీయండిరా వీళ్ల సంగతి చూద్దామ’ని బెదిరించారు. లోపలున్న విద్యార్థినులు కేకలు వేయ గా ధర్నా చేస్తున్న విద్యార్థినులు రావడంతో ఆ వ్యక్తు లు పారిపోయారు. హాస్టల్‌లో సమస్యలపై నిరసనకు దిగిన తమను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించడంపై విద్యార్థినులు ఆదివారం కూడా హాస్టల్ ఎదుట బైఠాయించారు. ‘హాస్టల్‌కు ప్రహరీ లేకపోవడంతో రాత్రివేళల్లో అనేకసార్లు ఆకతాయిలు వచ్చి తలుపులు కొడుతున్నారు.
మాకు రక్షణ కల్పించండ’ని విద్యార్థినులు కోరారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. గతంలో కంప్యూటర్, ఫర్నిచర్ ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. వారి ఆందోళనతో ఇన్‌చార్జి డీఈవో సిద్ధార్థ రెడ్డి, తహసీల్దార్ గిరిబాబు వచ్చి హాస్టల్‌ను పరిశీలించి, విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, హాస్టల్ పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, ఇతర మౌలిక వసతులపై సమీక్షించారు. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందున కేర్‌టేకర్ ఏ.కవిత, ఏఎన్‌ఎం జ్యోతి, వాచ్‌మెన్ టీ అంజలిని సస్పెండ్ చేశారు. హాస్టల్‌లో సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ‘లైటింగ్ పునరుద్ధరణ పనులను ప్రారంభించాం. సోమవారం బాత్‌రూం డోర్లు, గీజర్లు ఏర్పాటు చేయిస్తాం. హాస్టల్ ఎస్‌వోపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామ’ని చెప్పారు.