Maoists: మావోయిస్టు దళపతి దేవ్‌జీ ఎక్కడ?
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:53 AM
మావోయిస్టు దళపతిగా నియమితుడైన కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ? భద్రతా బలగాల అదుపులోనా...
దేవ్‌జీ ప్రొటెక్షన్ టీం గతంలో ఆంధ్రాలో అరెస్టు
దేవ్‌జీ సురక్షితంగా ఉన్నాడన్న మావోయిస్టు నేతలు
బలగాల తదుపరి టార్గెట్ ఆ ఐదుగురు..!
ఇప్పటికే అడవులను వదిలిన గణపతి, రాజిరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 26(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు దళపతిగా నియమితుడైన కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ? భద్రతా బలగాల అదుపులోనా? లేక అడవుల్లో సురక్షిత ప్రదేశంలోనా? హిడ్మా ఎన్‌కౌంటర్ సమయంలో దేవ్‌జీ ప్రొటెక్షన్ టీం ఆంధ్రాలో పట్టుబడిన సమయంలో ఏం జరిగిందనే అంశంపై చర్చ జరుగుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన పాక హన్మంతును భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టడంతో మిగిలిన తెలుగువారిలో దళాలను నడిపించే సామర్ధ్యం దేవ్‌జీకి మాత్రమే ఉందని మాజీ మావోయిస్టులు చెబుతున్నారు. దేవ్‌జీ ప్రస్తుతం అడవుల్లోనే సురక్షితంగా ఉండొచ్చని మాజీ మావోయిస్టులు చెబుతున్నారు.
సురక్షిత ప్రాంతాల్లోనే మావోయిస్టు కీలక నేతలు!
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ మాజీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి(75) నడవలేకపోతుండటంతో మైదాన ప్రాంతాల్లోని సేఫ్ షెల్టర్‌లో ఉంచారనే ప్రచారం జరుగుతోంది. మరో కేంద్ర కమిటీ సభ్యుడైన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా మైదాన ప్రాంతాలకు వెళ్లిపోయి ఉండొచ్చని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో మిగిలిన అగ్ర నాయకుల్లో తెలంగాణకు సంబంధించి తిరుపతి, దామోదర్... తెలంగాణ, చత్తీ్‌సగఢ్ ప్రాంతంలోనే ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో కూంబింగ్ ఉధృతం చేశారు. మరో అగ్రనేత పసునూరి నరహరి అలియా్‌స్ విశ్వనాథ్ కొంతమంది ఇతర రాష్ట్రాలకు చెందిన ద ళ సభ్యులతో కలిసి ఒడిషాలో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన మిసిర్ బెస్రా, పాతిరాం మాంజీ అలియాస్ అనల్‌దా ఒడిషా, చత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లో నేషనల్ పార్క్ వైపు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో మిగిలిన అతి కొద్ది మంది పీఎల్‌జీఏ సభ్యులతో కలిసి కేంద్ర కమిటీ నాయకులు సంచరిస్తున్నారని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్రం నిర్దేశించిన గడువు మార్చి 31లోపు అగ్రనేతలు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తారా లేక అడవుల్లోనే తూటాలకు రాలిపోతారా అనే విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.