kumaram bheem asifabad- క్రమబద్ధీకరణ ఎప్పుడు..?
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:49 PM
ప్రభు త్వం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తోందని వేయికళ్లతో ఎదురుచూస్తున్న రెండో ఏఎన్‌ఎంల ఆశలు అడియాశలే అవుతున్నాయి. సుమారు 17ఏళ్ల నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా వారిని పర్మనెంట్ చేయకపపోవడం, వయస్సు పైబడుతుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
- వయసు దాటుతోందని ఆందోళన
- జీవో 18లో చేర్చి రెగ్యులర్ చేయాలని వేడుకోలు
- చాలీచాలని వేతనాలతో ఇక్కట్లు
- 17ఏళ్ల నుంచి వైద్య సేవలందిస్తున్నామని ఆవేదన
- ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
బెజ్జూరు, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తోందని వేయికళ్లతో ఎదురుచూస్తున్న రెండో ఏఎన్‌ఎంల ఆశలు అడియాశలే అవుతున్నాయి. సుమారు 17ఏళ్ల నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా వారిని పర్మనెంట్ చేయకపపోవడం, వయస్సు పైబడుతుండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పెరిగిన ధరలకు అనుగుణంగా సరైన వేతనాలు లేకపో వడంతో చాలీచాలని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. జీవో 18లో చేర్చి రెగ్యులరైజ్ చేయాలని వేడుకుంటు న్నారు. జిల్లాలో 335గ్రామపంచాయతీలుండగా, 108ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటిలో 93 మంది రెండో ఏఎన్‌ఎంలు విధులు నిర్వహిస్తున్నా రు. వీరు 207-10మద్యలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో భాగంగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా తమ తలరాత మాత్రం మారడం లేదని వాపోతు న్నారు. కొందరి వయస్సు నాలుగు పదులు దాటుతున్నా మారు మూల ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా 2500మందికి ఒక ఏఎన్‌ఎం ఉండాల్సి ఉండగా, నాలుగైదు వేల మంది జనాభాకు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు గ్రామాలు కూడా ఉన్నాయి.
- పనులన్నీ వీళ్లతోనే..
ఆరోగ్య కార్యకర్తలుగా పిలిచే రెండో ఏఎన్‌ఎంలు ప్రభుత్వం అమలు చేసే పనులకు దగ్గరగా, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఫలాలకు దూరంగా ఉన్నారనే చెప్పుకోవాలి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్యక్రమాలను రెగ్యులర్ వారితో సమా నంగా విజయవంతం చేయడంలో పని చేయా ల్సిందే. కానీ సెకండ్ ఏఎన్‌ఎం గర్బిణీలకు మెట ర్నిటీ సెలవులు, హెల్త్‌కార్డులు, ట్రావెలింగ్ అల వెన్స్, యూనిఫాం అలవెన్సులు మాత్రం అందవు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో పిల్లలు, తల్లుల ఆరోగ్య సంరక్షణ, టీకాలు వేయడం, క్షేత్రస్థాయిలో గ్రామా లకు వెళ్లి రోగపీడితులను గుర్తించి వైద్యసేవలు, ఆరోగ్య సలహాలు అందిస్తుంటారు. ప్రభుత్వం నిర్వహించే డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాలను చేపట్టడం, నేషనల్ ప్రోగ్రాం ఆక్టివిటీస్, ఇంటింటి పర్వేలు, కుష్టు, క్షయ, మలేరియా, డెంగీ వంటి రోగాల సర్వేలు చేపట్టి వైద్యం అందిస్తుంటారు. ఎంసీహెచ్ కిట్(మదర్ అండ్ చైల్డ్ ఇమ్యునైజేషన్), యూవి న్(యూనివర్సల్ ఇమ్యునూజేషన్), ఎన్‌సీడీ, ఐహె చ్‌ఐపీ వంటి కార్యక్రమాలతో పాటు వీటికి సంబంఽ దించిన 33రిజిస్టర్లు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు.
- సేవల్లో కీలకపాత్ర పోషించినా..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విజయవంతంగా చేయడంతో పాటు ప్రజలకు వైద్యసేవలు అందించడంలో రెండో ఏఎన్‌ఎంలు కీలకపాత్ర పోషిస్తున్నారు. కరోనా సమయంలో సై తం కూడా విధులు విజయవంతంగా నిర్వహించిన వారిపై ప్రభుత్వం శీతకన్ను వేసిందని వారు వాపోతున్నారు. ఒకవైపు ఎన్‌సీడీ పరీక్షలు, సర్వేలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వెళ్లి అల్బెండజోల్ మాత్రల పంపిణీ తదితర పనులన్నీ రెగ్యులర్ వారితో సమానంగా చేస్తున్నా జీతం ఇవ్వడంలో మాత్రం ప్రభుత్వం వ్యత్సాసం చూపడం ఎంత వరకు సమంజసమని రెండో ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఏఎన్‌ఎంలతో సమానంగా పని చేస్తున్నా సమాన పనికి సమాన వేతనం వర్తించక ఇబ్బందులు పడుతున్నారు. నెల కు రూ.27,300మాత్రమే ఉండగా, రెగ్యులర్ ఏఎన్ ఎంలకు రూ.85వేల నుంచి 90వేల వరకు లభిస్తోం ది. ప్రభుత్వం ఇప్పటికైనా తమను క్రమబద్ధీకరిం చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రెగ్యులరైజ్ చేయాలి..
- భాగ్య, రెండో ఏఎన్‌ఎం
జీవో 18లో రెండో ఏఎన్‌ఎంలను చేర్చడంతో పాటు మా సేవలు గుర్తించి రెగ్యులరైజ్ చేయాలి. గతంలో ప్రభుత్వం రెండో ఏన్‌ఎంలకు నిర్వహిం చిన పరీక్ష ఫలితాలను విడుదల చేసి, పోస్టులు పెంచి వారికి రెగ్యులర్ ఉత్తర్వులు జారీ చేయాలి.