Share News

పోడు కష్టాలు తీరెదెప్పుడో?

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:40 PM

అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీల కష్టాలు దశాబ్దాలు గడుస్తున్నా తీరడం లేదు. పోడు వ్యవసాయదారులకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సమస్య తీరకపోగా, ప్రతియేటా మరింత జఠిలం అవుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొంతమందికి పోడు పట్టాలిచ్చినప్పటికీ అది సంపూర్ణం కాకపోవడంతో అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

పోడు కష్టాలు తీరెదెప్పుడో?

- అటకెక్కిన ప్రభుత్వ హామీ

- దశాబ్దాలుగా హక్కుల కోసం ఆదివాసీల ఎదురుచూపు

- అటవీ భూముల్లోకి వెళ్తే తరుముతున్న అధికారులు

- కారం, కర్రలతో తిరగబడుతూ కేసుల పాలవుతున్న మహిళలు

- మంచిర్యాల జిల్లాలో 10వేల దరఖాస్తులు పెండింగ్‌

మంచిర్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీల కష్టాలు దశాబ్దాలు గడుస్తున్నా తీరడం లేదు. పోడు వ్యవసాయదారులకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సమస్య తీరకపోగా, ప్రతియేటా మరింత జఠిలం అవుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొంతమందికి పోడు పట్టాలిచ్చినప్పటికీ అది సంపూర్ణం కాకపోవడంతో అర్హులైన గిరిజనులు, గిరిజనేతరులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల తరబడి హక్కు పత్రాల కోసం ఆదివాసీలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్‌) ప్రాతిపదికన అర్హులైన వారికి పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. 29 డిసెంబరు 2006 నుంచి ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం అమల్లోకి రాగా 1930 నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరులు, 2005కు ముందు నుంచి సాగులో ఉన్న గిరిజనులకు మాత్రమే హక్కు పత్రాలు పొందే వెసులుబాటు ఉంది. పోడు సమస్యను పరిష్కరించి 2005 నాటికి సాగులో ఉన్నవారిని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలోని 14 మండలాల్లోని 93 గ్రామాల్లో మొత్తం 33,418.19 ఎకరాల పోడు భూములు ఉన్నాయి. వీటిలో గిరిజనులకు చెందినవి 13,587.37 ఎకరాలు కాగా మిగతా 19,830.22 ఎకరాల్లో గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారు. పోడు పట్టాల కోసం 2022 నవంబరు 8న ధరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అదే నెల 20న ముగిసింది. గడువు ముగిసే సమయానికి జిల్లావ్యాప్తంగా మొత్తం 11,877 దరఖాస్తులు రాగా, దరఖాస్తు దారుల్లో 4,503 మంది గిరిజనులు, 7,374 మంది గిరిజనేతరులు ఉన్నారు.

ఫ తొలిదఫా 1,847 మంది ఎంపిక...

పోడు పట్టాలు జారీ చేసేందుకు దరఖాస్తుదారుల నుంచి తొలి దఫాలో మంచిర్యాల జిల్లావ్యాప్తంగా మొత్తం 1,847 మందిని అర్హులుగా గుర్తించారు. మిగతా 10వేల పై చిలుకు దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. తొలి దఫాలో ఆయా మండలాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మొత్తం 3,821.64 ఎకరాల భూమిని కూడా గుర్తించగా 2023 జూన్‌ 30న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇదిలా ఉండగా పోడు పట్టాలు ఇచ్చేందుకు దరఖాస్తుదారుల్లో అతి తక్కువ మందిని ఎంపిక చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. మిగతా అర్హులకు రెండో దఫాలో అందజేస్తామని ప్రకటించినా... అది కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇస్తానని హామీ ఇచ్చింది. అయితే రెండేళ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఆదివాసీ రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.

ఫ కేసుల్లో ఇరుక్కుంటున్న మహిళలు...

ప్రతియేటా వర్షాకాలం ప్రారంభం కాగానే అడవుల సమీపంలో నివసించే ఆదివాసీలు పోడు వ్యవసాయం కోసం ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో అడవుల్లో చెట్లు, పొదలను తొలగిస్తూ భూమిని చదును చేసుకుంటారు. అటవీ ప్రాంతం కావడంతో పోడు వ్యవసాయం కోసం ఆదివాసీలు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు అడ్డుకుంటున్నారు. ఈక్రమంలో అధికారులకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. అధికారులు తమ వద్దకు రాకుండా ఆదివాసీలు సైతం ప్రతిఘటిస్తున్నారు. కర్రలు, కారం పొడితో ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవుతున్నారు. 2022 జూలై 8వ తేదీన జిల్లాలోని దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిదిలోని కోయపోశగూడలో ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. రెండు రోజులపాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వర్షాకాలం కావడంతో తల దాచుకునేందుకు ఆదివాసీలు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడిసెలు అటవీ భూముల్లో ఉన్నాయనే కారణంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పోలీసుల సహకారంతో వాటిని తొలగించేందుకు ప్రయత్నించగా ఆదివాసీ మహిళలు ప్రతిఘటిస్తూ అడ్డుకున్నారు. మరునాడు గుడిసెలను తొలగించేందుకు దాదాపు మూడు వందల మంది ఫారెస్టు, పోలీసు అధికారులు తమ సిబ్బందితో గూడేన్ని రోప్‌ పార్టీలతో చుట్టుము ట్టారు. గుడిసెలను తొలగించే క్రమంలో అడ్డువచ్చిన మహిళలను ఈడ్చివేయడంతో కోపోద్రిక్తులైన మహిళ లు అధికారులతో ఘర్షణకు దిగారు. అధికారులను అ డ్డుకునేందుకు ఆదివాసీ మహిళలు వారిపై ఎదురు దాడికి దిగారు. కారంపొడి, కర్రలు చేతబూని తిరగ బడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసు కుంది. దీంతో మహిళలను అరెస్టు చేసి తాళ్లపేట అట వీ రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. అనంతరం లక్షె ట్టిపేట కోర్టులో హాజరు పర్చగా 12 మంది మహిళలకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఆ తరువాత కూడా ప్రతియేటా వర్షాకాలంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ నెల 13న జిల్లా లోని దండేపల్లి మండలం దమ్మనగూడ, మామిడి పల్లిలో కూడా పోడు వివాదం నెలకొనగా, అధికారులకు అడ్డు వచ్చిన 13 మంది మహిళలను అరెస్టు చేశారు.

Updated Date - Sep 21 , 2025 | 11:40 PM