kumaram bheem asifabad- డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు ఎప్పుడు..?
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:10 PM
డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా అధికారులు కేటాయించక పోవడంతో నిరాశ చెందుతున్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న ప్రభుత్వం ఆశయం ఇందిరమ్మ ఇళ్ల వేగవంతంతో నెరవేరుతుండగా, గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పంపిణీలో తాత్సారం చేసింది. వాటిని కూడా పేద వారికి పంపిణీ చేసేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి
- ఇటీవల అధికారుల పరిశీలనతో చిగురిస్తున్న ఆశలు
కాగజ్‌నగర్ టౌన్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా అధికారులు కేటాయించక పోవడంతో నిరాశ చెందుతున్నారు. పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న ప్రభుత్వం ఆశయం ఇందిరమ్మ ఇళ్ల వేగవంతంతో నెరవేరుతుండగా, గతంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పంపిణీలో తాత్సారం చేసింది. వాటిని కూడా పేద వారికి పంపిణీ చేసేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాగజ్‌నగర్ బోరిగాం శివారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాలను ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇటీవల డబుల్ బెడ్‌రూం ఇళ్లను కలెక్టర్, వెంకటేశ్ దోత్రే, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు, గృహ నిర్మాణ శాఖ డీఈఈ వేణుగోపాల్, ఆర్ అండ్‌బి, మున్సిపల్ శాఖాధికారులు పరిశీలించారు. మూడేళ్ల క్రితం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఉపయోగంలోకి తేవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను గతంలోనే లక్కీడిప్ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. కాగజ్‌నగర్‌లో 288 (జీ+2) ఇళ్ల నిర్మాణం చేపట్టారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లల్లో దాదాపు అన్ని సౌకర్యాలు పూర్తి చేయాలని భావించారు. ఈలోగా ఎన్నికలు రావడంతో పట్టించుకోలేదు. ఇళ్లకు దరఖాస్తులు అధికంగా రావడం, తక్కువగా ఉండడంతో ఎంపిక చేపడితే సమ్యలు వస్తాయని పంపిణీ కోసం లక్కీడిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కన పెట్టారు. ఎన్నికలు రావడంతో పంపిణీ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఇంకా డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించకపోవడంపై లబ్దిదారులు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తదితర సౌకర్యాలు పూర్తి చేసి ప్రారంభం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో నిరుపేదలు సొంతింటి కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగజ్‌నగర్‌లో 488 మంజూరుకు గాను 288 నిర్మాణాలు చేపట్టారు. లబ్ధిదా ుల ఎంపికను రెవెన్యూ అధికారులు పూర్తి చేసినప్పటికీ కూడా ఇంత వరకు ఇవ్వలేదు. డబుల్ బెడ్‌రూంలో గృహ సముదాయాల్లో రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, విద్యుత్ శాఖల అధికారులు సందర్శించారు. ఇండ్లలో విద్యుత్ సరఫరా, కిటికీలు, తలుపులు, తాగునీరు, మురుగు కాలువలు, రోడ్లు, పనులు పూర్తి చేయడంతో పాటు ఇళ్ల మధ్యలో పెరిగిన ముళ్లపొదలను తొలగించి, పారిశుధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో కదలిక వచ్చినట్లయింది. దీంతో ఇళ్లు అందుతాయని లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
అర్హులకు ఇళ్లు కేటాయించాలి..
- లెండుగురే శ్యాంరావు, బీఆర్‌ఎస్ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి
డబుల్ బెడ్‌రూం ఇళ్లు అర్హులకు ఇళ్లు కేటాయించాలి. గతంలో లక్కీడిప్ ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏరాట్లు చేశారు.అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా అధికారులు కేటాయించక పోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయం.