Share News

kumaram bheem asifabad- రాజీవ్‌ యువ వికాసం ఏది?

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:08 AM

యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం అమలు ఎప్పుడు చేస్తామనే దానిపై స్పష్టత లేక పోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. దరఖాస్తులు సమర్పించి ఆరు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

kumaram bheem asifabad- రాజీవ్‌ యువ వికాసం ఏది?
కెరమెరిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎంపీడీవో(ఫైల్‌)

- అమలుపై స్పష్టత ఇవ్వని సర్కారు

కెరమెరి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం అమలు ఎప్పుడు చేస్తామనే దానిపై స్పష్టత లేక పోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందుతున్నారు. దరఖాస్తులు సమర్పించి ఆరు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న యువత ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. వాస్తవానికి జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్స వం నాడు రాయితీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో దరఖాస్తుదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

- నిబంధనల ప్రకారం..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం..యువ వికాసం పథకానికి జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకం కిద ఎస్సీ, ఎస్టీ. బీసీ, ఈడబ్యూఎస్‌, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకొని రూ.4లక్షల వరకు వివిధ రకాల యూనిట్ల కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ.50 వేల యూనిట్‌కు 100 శాతం సబ్సిడీ,రూ. లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం70 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్‌కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌తో పాటు అప్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించారు, జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరిల్లో కలిపి మొత్తం 30,022 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 8,879 యూనిట్ల మంజూరయ్యాయి. వీటిలో మైనార్టీల దరఖాస్తులు 2,677 రాగా 499 మందికి, 33 క్రిస్టియన్‌ దరఖాస్తు రాగా 25 మందికి, ఈబీసీ/ఈడబ్ల్యూఎస్‌ దరఖాస్తులు 413 రాగా 410 మందికి, ఎస్టీ దరఖాస్తులు 7,370 రాగా 3,855 మందికి, ఎస్సీ దరఖాస్తులు 6,939 రాగా 2185 మందికి యూనిట్లు మంజూరయ్యాయి. 18 నుంచి 55 ఏళ్ల లోపు నిరుద్యో గులకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. కానీ ప్రభుత్వం దీని ఊసే ఎత్తక పోవడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అయిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చి అమలు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:08 AM