Share News

kumaram bheem asifabad-గ్రామ పంచాయతీలు గాడిన పడేదెన్నడో..?

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:32 PM

పాలక వర్గాలు లేక గ్రామ పంచా యతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? గ్రామ పంచాయతీలకు నిధులు ఎప్పుడు వస్తాయో అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

kumaram bheem asifabad-గ్రామ పంచాయతీలు గాడిన పడేదెన్నడో..?
లోగో

- 20 నెలలుగా జీపీలకు పాలకవర్గం కరువు

- ఎక్కడికక్కడ పేరుకుపోతున్న సమస్యలు

- నిధులు లేక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు

చింతలమానేపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): పాలక వర్గాలు లేక గ్రామ పంచా యతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లోని సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? గ్రామ పంచాయతీలకు నిధులు ఎప్పుడు వస్తాయో అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి 20 నెలలు కావస్తోంది. ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినా బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హై కోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్ధల ఎన్నికలపై నేటికీ సందిగ్ధం నెలకొంది.

- 15 మండలాల పరిధిలో..

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలుండగా కొన్ని మేజర్‌ జీపీలు ఉండగా, మరికొన్ని మైనర్‌ జీపీలున్నాయి. 500 జనాభా ఉన్న ప్రతీ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేయడంతో ప్రజలకు పంచాయతీల పాలన అందుబాటులోకి వచ్చినా ప్రభుత్వం నుండి నిధులు రాక ఎక్కడి గొంగళి అక్కడే అన్నచందంలా మారింది. సర్పంచుల పదవీకాలం 20 నెలల క్రితం ముగిసింది. అప్పటి నుండి గ్రామాల్లోని సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారు. కొంత కాలం ప్రత్యేక అధికారులను నియమించినా అదనపు పని భారంతో సమస్యలపై దృష్టి పెట్టలేక పోయారు. ఫలితంగా గ్రామాల్లోని పారిశుధ్య, తాగునీరు, తదితర కార్యక్రమాలు సక్రమంగా సాగడం లేదు.

- అప్పుల్లో కార్యదర్శులు..

గ్రామ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. గత బీఆర్‌ఎస్‌ హాయాంలో ప్రతీ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్లు అవసరమని, వాటి ద్వారా పరిసరాలు పరిశుభ్రం చేసుకునే అవకాశం ఉంటుందని ట్రాక్టర్‌ షోరూంల ద్వారా అరువుపై ట్రాక్టర్లను మంజూరు చేశారు. నాలుగేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరిగ్గా నిధులివ్వడంతో ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించడంతో పాటు విద్యుత్‌ ఖర్చులు చేస్తూ గ్రామ పంచాయతీల నిర్వహణ సక్రమంగా నిర్వహించారు. మరి కొన్ని నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు వస్తాయని భావించిన ప్రభుత్వం పంచాయతీలకు నిధులు నిలిపివేసింది. అప్పటికే జీపీల్లో పారిశుధ్య చర్యలు, మురికి కాలువల నిర్మాణాలు, సిమెంట్‌ రోడ్లు, బోరుబావుల మరమ్మత్తులు వంటి పనులు చేసిన సర్పంచులు నిధుల్లేక నీరసించి పోయారు. జిల్లాలో ఉన్న ప్రతీ జీపీ కార్యదర్శి 2నుండి 3 లక్షల వరకు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ది పనులు చేసినట్లు తెలుస్తోంది.

- పైసా ఇవ్వని ప్రభుత్వం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టినా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయలేదు. గత మూడేళ్లగా స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు పంచాయతీలకు మంజూరు కావడం లేదు. జనాభా ప్రాతిపదికన మైనర్‌, మేజర్‌ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు సైతం పెండింగ్‌లో ఉండడం వల్ల జీపీల్లో ఎలాంటి అభివృద్ది పనులు కావడం లేదు. కనీస అవసరాలకు కార్యదర్శులు అప్పులు తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం మల్టీపర్పస్‌ వర్కర్ల వేతనాలను మాత్రమే ప్రభుత్వం అందిస్తోంది. అలాగే రెగ్యులర్‌ కార్యదర్శుల వేతనాలు అందజేస్తూ ఔట్‌ సోర్సింగ్‌ కార్యదర్శుల వేతనాలను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీలకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలి..

- ధోని శ్రీశైలం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. గతంలో బీఆర్‌ ఎస్‌ నిర్లక్ష్యం చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే బాటలో పని చేస్తోంది. ప్రభుత్వం నిధులు కేటాయించి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి.

Updated Date - Oct 23 , 2025 | 10:32 PM