గతంలో ఇచ్చిన హామీ ఏమైంది?
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:36 AM
‘పునరావాసం కల్పిస్తామని గతం లో ఇచ్చిన హామీకి అతీగతి లేదు.. పునరావాసంపై మాకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తాం’ అని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చర్లగూడ రిజర్వాయర్ భూ నిర్వాసిత మహిళలు స్పష్టంచేశారు.
ఆర్డీవోను ప్రశ్నించిన భూనిర్వాసిత మహిళలు
కొనసాగుతున్న చర్లగూడెం రిజర్వాయర్ నిర్వాసితుల ఆందోళన
మర్రిగూడ, జూలై 15(ఆంధ్రజ్యోతి): ‘పునరావాసం కల్పిస్తామని గతం లో ఇచ్చిన హామీకి అతీగతి లేదు.. పునరావాసంపై మాకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తాం’ అని నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చర్లగూడ రిజర్వాయర్ భూ నిర్వాసిత మహిళలు స్పష్టంచేశారు. డిండి ఎత్తిపోతల పథకంలో చర్లగూడ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన చర్లగూడెం నిర్వాసితులు చర్లగూడెం ప్రాజెక్టు పనులు అడ్డుకొని క్యాంపు కార్యాలయం వద్ద టెంట్‌వేసి మంగళవారం రెండో రోజు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న చండూరు ఆర్డీవో శ్రీదేవి అక్కడికి చేరుకొని భూ నిర్వాసితులతో మాట్లాడారు. అర్హులైన భూ నిర్వాసితులకు పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామన్నారు. పనులు అడ్డుకోవద్దని, సహ కరించాలని కోరారు. రెండు నెలల్లోనే సమస్యలను పరిష్కరి స్తామన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 12 సంవత్సరాలు కావొస్తున్నా అర్హులైన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాసం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం రిజర్వాయర్ వద్దకు చేరుకొని చింతపల్లి మండలం వర్కాల గ్రామ సమీపం లోని సర్వేనెంబర్ 173లో ఉన్న 35 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీ లిం చారని, అక్కడ ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అన్నారు. మా సమస్యలు పరిష్కరించేవరకు పనులు అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భూ నిర్వాసితులు అపోహలు చెందకుండా కాస్త గడువు ఇవ్వాలని, పునారావాసం, ఆర్‌అండ్‌ఆర్ ప్రత్యేక ప్యాకేజీ అందించి న్యాయం చేస్తామన్నారు. బాధితులకు ఎంత నచ్చజెప్పినా వినకుండా ధర్నా కొనసాగింది. కార్యక్రమంలో తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్, డీటీ చంద్రశేఖర్. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ నా యక్, ఇరిగేషన్ ఈఈ రాములునాయక్, డీఈ కాశీం, సీఐ దూది రాజు, ఎస్‌ఐ కృష్ణారెడ్డి, భాధిత భూ నిర్వాసితులు కేశవులు, వల్లపు రాంకోటి, సుగుణమ్మ, మారమ్మ, బడేటి యాదయ్య, మాధాగోని శ్రీను ఉన్నారు.
నిర్వాసితుల వంటా వార్పు
పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని క్యాంపు కార్యాలయం వద్ద మహిళలు వంటవార్పు నిర్వహించారు. చర్లగూడెం రిజర్వాయర్‌లో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన 335 మందికి పునరావాసం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా ప్రభుత్వం కాల యాపన చేస్తున్నారన్నారు. సమస్యలు, డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్షలో పాల్గొంటామని తెలిపారు. దీక్ష కార్యక్రమంలో సుగుణమ్మ, యా దమ్మ, మారమ్మ, గొప్పమ్మ, రాజమ్మ, వెంకటయ్య, మల్లయ్య ఉన్నారు.
పనులు సమర్థంగా చేపట్టాలి
చర్లగూడెం రిజర్వాయర్ పనులను సమర్థంగా చేపట్టాలని చండూరు ఆర్డీవో శ్రీదేవి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపు గురైన చర్లగూడెం ముంపు గ్రామ బాధితులకు పునరావాసం కల్పించేందుకు స్థలం సేకరించినట్లు తెలిపారు. బాధితుల వివరాలు జాబితాలకు సంబంధించిన నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. భూభారతి అర్జీలకు ఆగస్టు 14 వరకు పూర్తి చేయాలని తెలిపారు.