Share News

kumaram bheem asifabad- రాజీవ్‌ యువ వికాసం ఇచ్చేదెన్నడు..?

ABN , Publish Date - Nov 13 , 2025 | 10:07 PM

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌ యువవికాసం పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, మైనార్టీలకు రూ. 50 వేల నుంచి మొదలుకుని రూ. 4 లక్షల వరకు వివిధ రకాల యూనిట్లు కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలు అందించాలిని ప్రభుత్వం నిర్ణయించింది.

kumaram bheem asifabad- రాజీవ్‌ యువ వికాసం ఇచ్చేదెన్నడు..?
వాంకిడిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు(ఫైల్‌)

- పరిశీలన పూర్తయినా నిరుద్యోగులకు తప్పని నిరీక్షణ

- జిల్లాలో 29,756 మంది దరఖాస్తులు

- స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

వాంకిడి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌ యువవికాసం పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, మైనార్టీలకు రూ. 50 వేల నుంచి మొదలుకుని రూ. 4 లక్షల వరకు వివిధ రకాల యూనిట్లు కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలు అందించాలిని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 50 వేల యూనిట్‌కు వందశాతం సబ్సిడీ, రూ. లక్ష నుంచి 2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు యూనిట్‌లకు 70 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్‌కార్డు కాలిగిన నిరుపేద కుటుంబంలోని ఒకరు మాత్ర మే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌తో పాటు ఆప్‌లైన్‌లోను దరఖాస్తులు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందాలనుకున్న యువత ఆశలు ఆవిరవుతున్నాయి. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులను కలుస్తూ పథకంపై ఆరా తీస్తున్నారు.

- ప్రభుత్వ సూచన మేరకు..

ప్రభుత్వ సూచన మేరకు యువ వికాసం పథకానికి జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలోని వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 29,756 మంది దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేశారు. దీంతో పాటు అధికారులు దరఖాస్తు దారులకు సంబంధిత బ్యాంకు అధికారులతో కలిసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందుకు అనుగుణంగా ఈ పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జూన్‌ 2 ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ నేటికీ పథకం అమలుకు నోచుకోలేదు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి యువవికాసం అమలుపై ఎలాంటి స్పష్టత రాకోవడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పథకం అమలు చేస్తారా అన్న విషయంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా గత ప్రభుత్వం హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మందికి రుణాలు మంజూరైనా ఆర్థికశాఖలో పెండింగ్‌ కారణంగా వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఆ దరఖాస్తుదారులకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాత రుణాలందక, యువ వికాసానికి అవకాశం లేక నష్టపోయారు.

మండలాల వారీగా దరఖాస్తులు ఇలా..

ఆసిఫాబాద్‌ 3,040

వాంకిడి 1,074

తిర్యాణి 1,690

సిర్పూర్‌(యూ) 893

రెబ్బెన 2,827

సిర్పూర్‌(టి) 1,616

పెంచికల్‌పేట్‌ 1,072

లింగాపూర్‌ 793

కౌటాల 2,327

కెరమెరి 1,761

కాగజ్‌నగర్‌ 5,486

జైనూర్‌ 1,860

దహెగాం 1,622

చింతలమానెపెల్లి 1,907

బెజ్జుర్‌ 1,788

-----------------------------------

మొత్తం 29,756

-----------------------------------

ప్రభుత్వం తీరు సరికాదు..

- అజయ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామని యువ వికాసం పేరిట రుణాలు అందిస్తామని చెప్పి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేయడం సరైంది కాదు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం యువ వికాసం పథకం ఊసెత్తడంలేదు. దరఖాస్తు చేసుకున్న యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించిన ప్రభుత్వం పథకం అమలు చేయడంపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా రుణాలు అందించి యువతకు ఉపాధి కల్పించాలి.

స్టేషనరీ దుకాణం ఏర్పాటుకు..

- ఇటన్‌కార్‌ తిరుపతి, దరఖాస్తుదారులు

రాజీవ్‌ యువ వికాసం పథకంలో స్టేషనరీ కోసం దరఖాస్తు చేసుకున్నా. జూన్‌ 2 నుంచి రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎంతో ఆశపడ్డాను. ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్నా అమలు చేయడంలేదు. ఈ పథకం కోసం అధికారులను ఎవరిని అడిగినా పెనుంచి ఏమి రాలేదని చెప్తున్నారు. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. ప్రభుత్వం పథకాన్ని సత్వరమే అమలు చేసి రుణాలు అందిస్తే ఉపాధి పొందుతాం.

Updated Date - Nov 13 , 2025 | 10:07 PM