Share News

kumaram bheem asifabad- వామ్మో చలి

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:18 PM

జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడి పోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. శనివారం జిల్లా లోని తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయాయి. దీనికి తోడు గ్రామాల్లో పొగమంచు కమ్మెస్తోంది. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి.

kumaram bheem asifabad- వామ్మో చలి
ఆసిఫాబాద్‌లో చలిమంట కాగుతున్న ప్రజలు

- చలి మంటలతో ఉపశమనం

ఆసిఫాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడి పోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. శనివారం జిల్లా లోని తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయాయి. దీనికి తోడు గ్రామాల్లో పొగమంచు కమ్మెస్తోంది. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు చలి నుంచి రక్షణ పొందేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం ఐదు గంటలు దాటితే జనాలు బయటికి వెళ్లనంత చలి తీవ్రత పెరగడంతో ఆసిఫాబాద్‌ ప్రాంతంలో జనజీవనం స్తంభిస్తోంది. ముఖ్యంగా అడవులు అధికంగా ఉన్న మండలాలైన తిర్యాణి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, బెజ్జూరు, చింతలమానెపల్లి, పెంచికలపేట, దహెగాం, కౌటాల, సిర్పూర్‌(టి), ఆసిఫాబాద్‌ ప్రాం తాల ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు షటర్లు, జర్కీన్‌లు ధరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చీకటైతే చాలు ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. చలితీవ్రత గతంలో ఎప్పుడు లేనంతగా కనిపిస్తుండడంతో రానున్న రోజుల్లో ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి ఆసిఫాబాద్‌ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ సారి సీజన్‌ లో కూడా చలి పంజా విసురుతుండడంతో జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్‌ డివిజన్‌ కేంద్రం చీకటి పడితే చాలు జనాలు లేక బోసిపోతోంది. ఉదయం 9 గంటలు దాటితే కానీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. తెల్లవారు లేవగానే పొలం పనులకు వెళ్లె రైతులు, పాలు పోసే వ్యాపారులు, పేపర్‌ బాయ్స్‌, వాకర్స్‌ చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు రక్షణ లేకుండా చలిలో బయటకు వెళ్లితే శ్వాస కోస సంబంధిత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

- ఏజెన్సీ మండలాల్లో ఇబ్బందులు..

జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో చలి తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిర్యాణి మండలం గిన్నెధరిలో అత్యల్పంగా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్‌(యు)లో 7.3, కెరమెరిలో 8.5, వాంకిడి, ఆసిఫాబాద్‌లలో 9.8, చింతలమానేపల్లిలో 10.0, పెంచికల్‌పేటలో 10.3, బెజ్జూరులో 10.6 కాగజ్‌నగర్‌లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లో షెటర్లు, జర్కీన్‌లకు గిరాకీ పెరిగింది. ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శరీరక్షణ కోసం షెటర్లు, జర్కీన్‌లు, మఫ్లర్లు, చేతి తొడుగులు తదితరాల కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - Dec 13 , 2025 | 10:18 PM