Minister Uttam Kumar Reddy: ఆరునూరైనా తుమ్మిడిహెట్టి నిర్మిస్తాం!
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:17 AM
ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఆరునూరైనా నిర్మించి తీరతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు....
బ్యారేజీ నుంచి 80 టీఎంసీల నీటిని తరలించడమే లక్ష్యం.. కాలువ అలైన్‌మెంట్‌పై 22లోగా నిర్ణయం తీసుకోండి
అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
2027 డిసెంబరు 9 కల్లా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తామని వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఆరునూరైనా నిర్మించి తీరతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం ఆయన సచివాలయంలో నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ మహ్మద్ అంజద్ హుస్సేన్, చీఫ్ ఇంజనీర్లతో టన్నెలింగ్ నిపుణుడు పరిక్షిత్ మెహ్రాతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి, 80 టీఎంసీల జలాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి 71.5 కిమీల దాకా గ్రావిటీ కెనాల్‌తో నీటిని సుందిళ్లకు తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి పంపింగ్ చేయాలా? లేక మైలారం దాకా వచ్చే నీటిని పంపింగ్ చేసి, ఎల్లంపల్లిలో పోయాలా? అనే దానిపై ఈ నెల 22లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదిత్యనాథ్ దాస్‌ను ఆదేశించారు. ఆయన్ను టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. సుందిళ్లకు గ్రావిటీతో నీటిని తరలించే అవకాశం ఉందని, ఆ ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నందున 14 కి.మీ. మేర టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని మంత్రి గుర్తుచేశారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నిపుణుల కమిటీ నివేదికే ప్రామాణికమని చెప్పారు. బ్యారేజీ పునరుద్ధరణ డిజైన్లకు సంబంధించి.. డిజైన్ కన్సల్టెంట్ బాధ్యతలు ఐఐటీ మద్రాసుకే అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వరదలు తగ్గుముఖం పట్టగానే బ్యారేజీల వద్ద కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరిశోధన సంస్థలతో పరీక్షలు చేయిస్తామన్నారు. ఏడాదిలోపు పనులన్నీ పూర్తిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమ్మక్కసాగర్‌కు ఎన్‌వోసీ ఇవ్వడానికి ఛత్తీ్‌సగఢ్ అంగీకారం తెలిపిందన్నారు.
ఎస్‌ఎల్‌బీసీపై హెలికాప్టర్‌తో సర్వే
వానలు తగ్గగానే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ కోసం హెలికాప్టర్‌తో సర్వే చేయిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. 2027 డిసెంబరు 9కల్లా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు పూర్తిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దేవాదులలో ఒక ప్యాకేజీ సవరణ అంచనాలపై రాబోయే మంత్రివర్గ భేటీలో నిర్ణయం ఉంటుందన్నారు. దేవాదుల మూడో దశ కింద భూసేకరణకు రూ.33 కోట్లను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. డిండి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై మూడు రోజుల్లోగా నివేదికను సిద్ధం చేయాలన్నారు. బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌లో తెలంగాణ వాదనలు పూర్తయ్యాయని, ఏపీ వాదనలు వినిపిస్తోందని ఆర్నెల్లలో తీర్పు వెలువడే అవకాశం ఉందన్నారు. కాగా, ప్రాణహిత నదిపై కుమరం భీం జిల్లా కౌటాల మండలంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం పరిశీలించారు.
వానాకాలం ధాన్యం కొనుగోలుకు రూ.21,112 కోట్లు
80 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తాం: ఉత్తమ్
రాష్ట్రంలో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా అరుదైన రికార్డును సాధించబోతున్నామన్నారు. ఇందులో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు రూ.21,112 కోట్లు సమకూర్చినట్లు వెల్లడించారు. వానాకాలం ధాన్యం సేకరణపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించే పథకం కొనసాగుతోందని చెప్పారు. సన్నధాన్యం 91 లక్షల టన్నులు, దొడ్డు ధాన్యం 58 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు పంటలకు రైతులకు బోనస్ చెల్లించడానికి రూ.3,158 కోట్లు కావాలని అంచనా వేశామన్నారు. బియ్యం సబ్సిడీ కింద కేంద్రం నుంచి రూ.6,500కోట్లు రావాల్సి ఉందని, వాటిని సత్వరమే విడుదల చేయాలని కోరామని ఉత్తమ్ చెప్పారు. ధాన్యం సేకరణలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)తో సమన్వయం చేసుకోవాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.