Share News

‘సంపద’ రాలే..‘ఖర్చు’ మిగిలే!

ABN , Publish Date - May 22 , 2025 | 12:28 AM

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చేపట్టిన సంపద వనాల పెంపకం నిరర్థకంగా మారింది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సంపద వనాల్లోని మొక్కలు ఎండిపోయాయి.

 ‘సంపద’ రాలే..‘ఖర్చు’ మిగిలే!
ఎండిపోయిన మొక్కలు

‘సంపద’ రాలే..‘ఖర్చు’ మిగిలే!

సంపద వనాల తీరు

నార్కట్‌పల్లిలో 4 ఎకరాల్లో ఏర్పాటు

స్థలం చదును చేయడంలో నిర్లక్ష్యం

ఎండిపోయిన మొక్కలు

నార్కట్‌పల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చేపట్టిన సంపద వనాల పెంపకం నిరర్థకంగా మారింది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సంపద వనాల్లోని మొక్కలు ఎండిపోయాయి. మొక్కల పెంపకానికి అనువుగాని స్థలాన్ని ఎంపిక చేసుకుని హడావుడిగా వ్యవహరించిన అధికారుల తీరుతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. వనాల పెంపకం ద్వారా ‘సంపద’ సృష్టించడం అటుంచితే చివరకు ‘ఖర్చే’ మిగిలింది. నీటి పారుదల శాఖకు చెందిన ఖాళీ స్థలాలు కబ్జా బారిన పడకుండా కాపాడాలనే ఉద్దేశంతో పాటు సంబంధిత గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సంపద వనాలనే వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. బహుళ ప్రయోజనాలు చేకూరేలా గత ప్రభుత్వం నీటి పారుదల శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో సంపద వనాలను పెంచేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలోని నీటిపారుదల శాఖకు చెందిన సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో రెండు సంపద వనాలను రెండు దశల్లో ఏర్పాటు చేసింది. ఉపాఽధి హామీ పథకంలో భాగంగా రెండింటిలో సుమారు 2 వేల మొక్కలను నాటారు. పండ్లనిచ్చే మొక్కలతో పాటు దీర్ఘకాలం లాభదాయకంగా ఉండేలా అటవీశాఖ ఎంపిక చేసి సరఫరా చేసిన మొక్కలను నాటారు. గుంత తీయడానికి ఒక్కో గుంతకు రూ.23, మొక్కకు రూ.14లు చెల్లించారు. ఈ మొక్కల పెంపకానికి గాను వాచర్‌ నియమించి మూడేళ్ల పాటు నెలకు సుమారు రూ.9వేల చొప్పున చెల్లించారు. దీంతో పాటు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సంపద వనాల చుట్టూ రూ.లక్షలు వెచ్చించి ఫెన్సింగ్‌ వేయించారు.

అనువుగా లేని స్థలం

ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా అధికారుల వైఖరితో ఇక్కడ ల క్ష్యం నీరుగారిపోయింది. మొక్కల పెంపకానికి అప్పట్లో ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం దొరికిన స్థలంలో మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగానే సంపద వనాల కింద మొక్కలను నాటేందుకు నీటి పారుదల శాఖ చూపించిన స్థలం మొక్కలు నాటడానికి ఏ మాత్రం అనువుగా లేదు. బీ.వెల్లెంల ఉదయ సముద్రం రిజర్వాయర్‌కు పానగల్‌ ఉదయసముద్రం రిజర్వాయర్‌కు నీ టిని తరలించేందుకు తవ్విన సొరంగంపై భాగాన్ని మొక్కలు నాటేందు కు కేటాయించారు. అయితే సొరంగం తవ్వకంలో వచ్చిన రాతి చూరను నిల్వ చేసే నిమిత్తం పోశారు. సుమారు 4 నుంచి 5 ఫీట్ల వరకు పేరుకుంది. మొక్కలు నాటేందుకు ఉన్నతాధికారులు విధించిన లక్ష్యం ఒత్తిడి తో అనువుగా లేని చోట మొక్కలను బలవంతంగానే నాటారు. కాగా వ నంలోని మొక్కల పెంపకం కోసం వాచర్‌కిచ్చే వేతనాల వ్యవధి ఈ మా ర్చితో పూర్తయింది. ఫలితంగా ఈ సంపద వనాల్లోని మొక్కలు ఎండిపోగా ‘సంపద’ కు బదులు ‘ఖర్చు’ను మీదేసుకున్న తీరుగా మారింది.

స్థల ఎంపికలో నిర్లక్ష్యం

సంపద వనాల్లో పెంచిన మొక్కలు దాదాపు ఎండిపోతున్నాయి. కనీసం పచ్చ గా ఉన్న మొక్కలకైనా నీరు అందించి వా టిల్లో కొన్నింటినైనా బతికించాలి. ఐబీ స్థలా లు ఆక్రమణకు గురికాకుండా చూడాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా మొక్క లు నాటేటప్పుడే పెంపకానికి భూమి అనువుగా ఉందా లేదా అని అధికారులు చూసుకోవాల్సి ఉంది.

- మేడి వెంకట్‌, ఎల్లారెడ్డిగూడెం గ్రామస్థుడు

మొక్కలను బతికించేందుకు ప్రయత్నిస్తాం

ఎల్లారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన సంపద వనాల భూమి మొక్కలు పెరిగేందుకు అనువుగా లేదు. దీంతో మొక్కల వేర్లకు నీరందక అవి ఎండిపోతున్నాయి. కానీ ఎర్రమట్టితో గుంతలు నింపండంతో కొన్ని మొక్కలు బతికాయి. మళ్లీ అదే ప్ర యత్నం చేసి కొన్నింటినైనా బతికించేందు కు ప్రయత్నిస్తాం.

- ఏపీవో యాదయ్య, నార్కట్‌పల్లి

Updated Date - May 22 , 2025 | 12:28 AM