Anti Drug Campaign: వారెవ్వా వంగర పోలీసు
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:30 AM
వారిలో తాము పోలీసులమనే అధికారదర్పం లేదు! స్టేషన్ నుంచి కాలు బయటపెడితే జీపులోనో.. బైక్‌లపైనో వెళ్లాలనీ లేదు! సైకిలెక్కి మండల పరిధిలోని గ్రామాల్లోకి వెళతారు. ప్రజలను మాటల్లో పెట్టి. ఒల్లు గుల్ల చేసే గంజాయి వంటి దురలవాట్లు కూడదని..
జీపు, బైక్‌లు వదిలేసి సైకిళ్లపై గ్రామాల్లోకి సిబ్బంది.. యువతను చైతన్యం చేయడమే లక్ష్యం
గంజాయికి దూరంగా ఉండాలని ప్రచారం
సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అప్రమత్తం
స్వయంగా 50వేలు పెట్టి సైకిళ్లు కొన్న ఎస్సై దివ్య
భీమదేవరపల్లి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): వారిలో తాము పోలీసులమనే అధికారదర్పం లేదు! స్టేషన్ నుంచి కాలు బయటపెడితే జీపులోనో.. బైక్‌లపైనో వెళ్లాలనీ లేదు! సైకిలెక్కి మండల పరిధిలోని గ్రామాల్లోకి వెళతారు. ప్రజలను మాటల్లో పెట్టి. ఒల్లు గుల్ల చేసే గంజాయి వంటి దురలవాట్లు కూడదని.. ఇల్లు గుల్ల చేసే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కలిగిస్తారు. బాల్య వివాహాల కారణంగా జరిగే విపరిణామాలను, విద్య ప్రాముఖ్యతను వివరిస్తారు. ప్రజలను, ముఖ్యంగా యువతను చైతన్యం చేసేందుకు.. గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు ఇలా సైకిళ్లపై కదిలింది హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీసులు! మాజీ ప్రధాని పీవీ స్వగ్రామమైన వంగర పరిధిలో యువతను గంజాయి మత్తు నుంచి వదిలించేందుకు గ్రామాల్లోకి వెళ్లి వారితో మమేకమవుతున్నారు. వీధి వీధికి వెళుతున్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్టేషన్ ఎస్సై గొల్లెపల్లి దివ్య సొంతంగా రూ.50వేలు పెట్టి సిబ్బంది కోసం కొత్త సైకిళ్లు కొనుగోలు చేశారు. సైకిల్‌పై వచ్చి.. తమలో ఒకరిగా కలిసిపోయి మంచీచెడుపై అవగాహన కలిగిస్తున్న పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రత్నగిరి గ్రామంలో సైకిళ్లపైనే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. స్వయంగా ఎస్సై దివ్య సైకిల్ తొక్కుతూ గ్రామాలకు వెళ్లారు.
నిరంతరం సైకిళ్లపైనే పెట్రోలింగ్
గ్రామాల్లో పోలీసులు స్వచ్ఛందంగానే సైకిల్‌పై వెళుతున్నారు. ఈ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగుతోంది. గ్రామాల్లోని సమస్యలు, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా పోలీసులకు విన్నవించుకోవొచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పోలీసులు ప్రజల మధ్యే ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు దుండగులు జంకుతారు. గ్రామాల్లో పోలీసులు నిరంతరం తిరుగుతుండటంతో ఒంటరిగా నివసించేవారిలో, వృద్ధుల్లో ఓ భరోసా ఏర్పడుతుంది.
- దివ్య, ఎస్సై, వంగర