Share News

గోడ కూలి..ఇద్దరి దుర్మరణం

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:50 PM

కూలి పనికి వెళ్తేనే ఆ కుటుంబం గడిచేది. పొద్దంతా చెమటోడ్చి పని చేయడం..వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని సాకడం..ఇదీ వారి దినచర్య.. రోజులానే శుక్రవారం కూడా వారు కూలికి వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. పనికి వెళ్లిన వారు తిరిగి వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులకు మాత్రం చేదు వార్తే అందింది. పనులకు వెళ్లిన ఆ ఇద్దరూ ఇక తిరిగిరారని... పూర్తి వివరాల ప్రకారం..

గోడ కూలి..ఇద్దరి దుర్మరణం

బ్రాహ్మణపల్లిలో పనులు చేస్తుండగా ప్రమాదం..

కోటపల్లిలో విషాదం

కోటపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : కూలి పనికి వెళ్తేనే ఆ కుటుంబం గడిచేది. పొద్దంతా చెమటోడ్చి పని చేయడం..వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని సాకడం..ఇదీ వారి దినచర్య.. రోజులానే శుక్రవారం కూడా వారు కూలికి వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. పనికి వెళ్లిన వారు తిరిగి వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులకు మాత్రం చేదు వార్తే అందింది. పనులకు వెళ్లిన ఆ ఇద్దరూ ఇక తిరిగిరారని... పూర్తి వివరాల ప్రకారం..

కోటపల్లి మండల కేంద్రానికి శేగం తిరుపతి (50) , రెడ్డి మధునయ్య (52) అనే వ్యక్తులు పక్క గ్రామానికి కూలి పనులకు వెళ్లి గోడ కూలడంతో కానరాని లోకాలకు వెళ్లారు. మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణపల్లి గ్రామంలో వెల్మ శ్రీనివాస్‌ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో అతను నూతన ఇంటిని నిర్మించుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా అతడు నివాసం ఉంటున్న పాత ఇంటిని కూల్చివేసేందుకు కూలి పనుల నిమిత్తం కోటపల్లికి చెందిన శేగం తిరుపతి, రెడ్డి మధునయ్యలతో పాటు మరో నలుగురిని పనులకు పిలిచాడు. కాగా నలుగురు ఒక వైపు ఇద్దరు మరో వైపు ఉండి పాత గోడలు కూల్చుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా గోడ ఆ ఇద్దరిపై పడింది. అయితే ఇంటిపై గోడ భాగం నుంచి తొలగించాల్సి ఉండగా కింద నుంచి తవ్వడం వల్లనే ఒక్కసారిగా గోడ కూలి పనులు నిర్వహిస్తున్న తిరుపతి, మధునయ్యపై పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పక్కనే పనులు చేస్తున్న కూలీలతో పాటు ఇంటి యజమాని, చుట్టు పక్కల వారు ఒక్కసారిగా ఇద్దరిపై పడిన గోడ శిథిలాలను తొలగించారు. అప్పటికే ఆ ఇద్దరు తీవ్ర గాయాలపాలై ఉన్నారు. వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను చెన్నూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో రెడ్డి మధునయ్య మృతిచెందాడు. ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తుండగా శేగం తిరుపతి మృత్యువాడ పడ్డాడు. ఘటన స్థలాన్ని రూరల్‌ సీఐ బన్సీలాల్‌, తహసీల్దార్‌ రాఘవేంద్రరావు, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి సందర్శించారు. మృతిచెందిన తిరుపతికి భార్య భీమక్కతో పాటు ముగ్గురు కూతుళ్లు ఉండగా రెడ్డి మధునయ్యకు భార్య గతంలోనే మృతిచెందగా కుమారుడు ఉన్నారు. మృతదేహాల ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేందర్‌ పేర్కొన్నారు.

-అలుముకున్న విషాదం

నిత్యం కూలి పనులకు వెళ్తూ కుటుంబాలను సాకుతున్న కూలీలు ఇద్దరు మృ తిచెందడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృత్యువాత పడ్డ ఇద్దరూ కోటపల్లికి చెందిన వారే కావడంతో కోటపల్లిలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఎంతో కొంత సంపాదించి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ఇరువురు కానరాని లోకాలకు వెళ్లారన్న సమాచారంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - Jul 18 , 2025 | 11:50 PM