ఆసరా కోసం నిరీక్షణ!
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:21 AM
ఆసరా పింఛన్ల కోసం అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్థులు మూడేళ్లుగా పిం ఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు.

ఆసరా కోసం నిరీక్షణ!
మూడేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూపులు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
పట్టించుకోని పాలకులు, అధికారులు
శాలిగౌరారం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఆసరా పింఛన్ల కోసం అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్థులు మూడేళ్లుగా పిం ఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము పింఛన్లకు అర్హులమైనా పింఛన్లు రాక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాలిగౌరారం మండలంలో అర్హులైన వారు 455మంది పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. తా ము పింఛన్లకు అర్హులమైనా ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రతీ రోజు మీసేవకు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నారు. గతంలో కొన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉన్న వారు అనర్హులైనా ఇప్పించారని, అర్హులైన తమ కు పింఛన్లు అందడం లేదని ఆరోపిస్తున్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్నా కొత్త పింఛన్ల మంజూరీ జాడే లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఎంతో మంది అర్హులు పింఛన్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఆసరా ఫించన్లకు సంబంధించిన వెబ్‌సైట్ జూన 2022న క్లోజ్ అయినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఆసరా పింఛన్ల వెబ్‌సైట్ ప్రారంభం కాగానే దరఖాస్తు చేసిన వారందరి పేర్లు నమోదు చేసి పింఛన్ల మంజూరీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెబ్‌సైట్ పునరుద్ధంచాలని, అర్హులకు పింఛన్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
నాకు పింఛన మంజూరు చేయండి
నేను ఫైలేరియా బాధితురాలిని. నా భర్త మల్లయ్య దివ్యాంగుడు. పేద కుటుంబానికి చెందిన మాకు నలుగురు కుమారులు ఉండగా ముగ్గురు బతుకుదెరువు కోసం ముంబాయికి వెళ్లారు. ఒక కుమారుడు హైదరాబాద్‌కు వెళ్లాడు. మా జీవనోపాధికి ఎలాంటి ఆధారం లేదు. నాకు రెండేళ్ల క్రితం ఫైలేరియా (బోదకాలు) పింఛన వచ్చింది. ఒక నెలా ఇచ్చి పింఛన రద్దు చేశారు. దయచేసి నాకు తిరిగి పింఛన ఇప్పించండి.
బత్తుల సైదమ్మ, పైలేరియా బాధితురాలు, పెర్కకొండారం, శాలిగౌరారం
పింఛన లేక పూట గడవడం కష్టంగా ఉంది
నా భర్త చనిపోయి మూడేళ్లయింది. నాకు ఇల్లు, భూమి లేదు. అద్దె ఇంటిలో ఉంటున్నాను. పింఛన కోసం దరఖాస్తు చేసి మూడేళ్లు కావస్తుంది. నాకు పూట గడవడం కష్టంగా ఉంది. నాకు ఎలాంటి ఆధారం లేదు. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి నాకు ఫించన మంజూరీ చేసి నన్ను ఆదుకోవాలి.
సిరందాసు విజయలక్ష్మి, వితంతువు, శాలిగౌరారం
అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి
ఆసరా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరూ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ప్రభుత్వం ఆనలైనలో వెబ్‌సైట్ తెరవగానే అందులో నమోదు చేస్తాం. ఇప్పటి వరకు వివిధ పింఛన్ల కోసం శాలిగౌరారం మండల వ్యాప్తంగా 455 దరఖాస్తులు వచ్చాయి.
గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీడీవో, శాలిగౌరారం