Share News

Financial Fraudster: భార్యాబిడ్డల్ని వదిలిస్తే 25లక్షలు

ABN , Publish Date - Nov 23 , 2025 | 07:14 AM

పోలీసులకు దొరికినట్టే దొరికి.. వారితో బేరం కుదుర్చుకొని భార్యాబిడ్డలతో ఉడాయించిన ఆర్థిక నేరగాడు ఉప్పలపాటి సతీశ్‌కుమార్‌ను బెంగళూరులో...

Financial Fraudster: భార్యాబిడ్డల్ని వదిలిస్తే 25లక్షలు

  • ఆర్థిక నేరగాడు ఉప్పలపాటి సతీశ్‌ విచారణలో విస్తుపోయే విషయాలు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసులకు దొరికినట్టే దొరికి.. వారితో బేరం కుదుర్చుకొని భార్యాబిడ్డలతో ఉడాయించిన ఆర్థిక నేరగాడు ఉప్పలపాటి సతీశ్‌కుమార్‌ను బెంగళూరులో అరెస్టు చేసిన పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. అయితే, సతీష్‌ కుమార్‌ను విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. తన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు ఇస్తామని నమ్మించి సతీశ్‌.. పలువురి వద్ద నుంచి రూ.23 కోట్లు వసూళ్లు చేసి పరారయ్యాడు. డాక్టర్‌ వినయ్‌కుమార్‌ అనే బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు.. ఈ కేసులో సతీశ్‌తో పాటు అతని భార్య శిల్ప బండ, వారి కుమార్తెకు ప్రమేయం ఉందని గుర్తించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులు మహారాష్ట్రలో ఉన్నట్టు గుర్తించగా.. ఓ ఎస్సై నేతృత్వంలోని బృందం వారిని అరెస్టు చేసింది.


రూ. 25లక్షలు డీల్‌ కుదిర్చిన రిటైర్డ్‌ అధికారి

సదరు ఎస్సై నిందితులను హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. గతంలో ఈడీలో పని చేసి రిటైర్డ్‌ అయిన ఓ అధికారి రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ఈడీ కేసులో సతీష్‌ అరెస్టు అయినప్పుడు అతనికి పరిచయమైన ఆ రిటైర్డు అధికారి, మరో మధ్యవర్తితో కలిసి పథకం వేశాడు. సతీశ్‌ కుటుంబాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్న ఎస్సైతో ఒప్పందం కుదిర్చాడు. సతీష్‌ భార్య, కుమార్తెను వదిలిస్తే రూ.25 లక్షలు ఇస్తామని బేరం మాట్లాడినట్టు సమాచారం. సతీ్‌షను అరెస్టు చేసి తీసుకెళ్తున్నాం కాబట్టి మహిళలను వదిలేసినా ఇబ్బంది ఉండదని భావించిన ఆ ఎస్సై వారి ఒప్పందానికి అంగీకరించాడు. అయితే, సదరు ఎస్సైకు టోకరా వేసిన సతీశ్‌.. సదాశివపేట వద్ద తన భార్య, కుమార్తెతో కలిసి పరారయ్యా డు. భార్య బిడ్డలను పంపించి వస్తానని కారులో కొద్దిదూరం వెళ్లి అక్కడి నుంచి కారు డ్రైవరుతో సహా పారిపోయాడు. దాంతో ఎస్సై నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అప్పట్నించి కొద్దిరోజుల పాటు పరారీలో ఉన్న సతీష్‌ కుటుంబం ఇటీవల బెంగళూరులో పట్టుబడింది.

Updated Date - Nov 23 , 2025 | 07:16 AM