kumaram bheem asifabad- ఇక ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
ABN , Publish Date - Jul 02 , 2025 | 11:30 PM
ఎన్నికల సంఘం ఓటరు నమోదును నిరంతర ప్రక్రియగా చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కటాఫ్ తేదీని ఖరారు చేసి తుది ఓటరు జాబితాగా ప్రకటించనుంది. త్వరలోనే స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా యువత ఓటరుగా నమోదు చేసుకోవడమే మేలు.
- జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు అర్హులు
వాంకిడి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం ఓటరు నమోదును నిరంతర ప్రక్రియగా చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కటాఫ్ తేదీని ఖరారు చేసి తుది ఓటరు జాబితాగా ప్రకటించనుంది. త్వరలోనే స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా యువత ఓటరుగా నమోదు చేసుకోవడమే మేలు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. సదరు తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా అర్హత లభించేది. సదరు విధానానికి స్వస్తి పలికారు. జనవరి 1, జూలై 1, అక్టోబరు 1, తేదీలను సైతం ప్రమాణికంగా తీసుకోవా లని ఎన్నికల సంఘం నిర్ధేశించింది. జాబితాలో లాజికల్ పొరపాట్లు, డోమోగ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించింది.
- నమోదు ఇలా..
అరచేతిలోనే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో సెల్‌ఫోన్ నంబర్‌తో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అవ్వాలి. ఆన్‌లైన్‌లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, తప్పులను సరిచేసుకోవడానికి, జాబితాలో రెండు ఓట్లు ఉంటే ఒకదాన్ని తొలగింపు, ఇతర అంశాలకు సంబంధించి వేర్వేరుగా ఫారం-6, ఫారం-7, ఫారం-8 కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేసి అందులో పొందుపర్చాల్సిన వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వివరాలు ఏఈఆర్వొకు వద్దకు వెళ్తాయి. పరిశీలించి ఆమోదిస్తారు. వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీవద్ద ఉన్న మొబైల్‌లో హెచ్‌టీటీపీ:///ఓటర్స్.ఈసీఐ. గౌట్. ఇన్ యాప్ డైన్‌లోడ్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా లేదా చుసుకునే అవకాశం కల్పించారు.
- గుర్తింపు కార్డు పొందడం..
ఓటరు గుర్తింపు కార్డు కావాలనుకునేవారు వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో ఈ-ఎపిక్ కార్డు డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మొబైల్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. గుర్తింపు కార్డుకు ఫోన్ నంబర్ అనుసంధానం అయితే ఓటీపీ వస్తుంది. లేకుంటే రాదు. ఫారం-8 ద్వారా ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవచ్చు. తర్వాత గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఏయే ఫారం ఎందుకంటే...
ఫారం-6 : కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఈ దరఖాస్తును పూరించాలి. ఒక ఫోటో వయసు నిర్ధారణ పత్రం(పదో తరగతి మెమో) చిరునామా ఽద్రువీకరణ ఉండే కరెంట్ బిల్లు, నల్లా బిల్లు, ఇంటి పన్ను వంటి వాటిని జతచేయాలి.
ఫారం-6ఏ: విదేశాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఫార్మాట్ రూపొందించారు. ఎన్నారైలకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2018 నుంచి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఫారం -7 :ఓటరు జాబితాలో అభ్యంతరాలకు ఈ ఫారంను పూరించాల్సి ఉంటుంది. ఓటరు మరణించినా, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డా వారిని జాబితా నుంచి తొలగించాలని ఈ ఫారం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
ఫారం-8: పట్టణాల్లో చాలామంది ఒక కాలనీ నుంచి మరో కాలనీకి మారుతుంటారు. ఈ క్రమంలో ఓటు వేసేటప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. వారి కోసం ఈ ఫారం ఉపయోగపడుతుంది. ఒక పోలింగ్‌బూత్ నుంచి మరో సమీప పోలింగ్ బూత్‌కు మారేందుకు దరఖాస్తు చేయాలి.
- సందేహాలకు టోల్ ఫ్రీ నంబరు-1950
ఓటరు నమోదు, ఎన్నికలకు సంబందించి 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదు కూడా చేయోచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తారు. అంతేకాకుండా ఇంటర్‌నెట్ నెంచి ఈమెయిల్ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
- నియోజక వర్గాల వారీగా ఓటర్ల వివరాలు
నియోజకవర్గం పురుషులు స్త్రీలు ట్రాన్స్ జెండర్‌లు మొత్తం
ఆసిఫాబాద్ 1,13,815 1,15,813 16 2,29,644
సిర్పూర్ 1,15,323 1,15,811 16 2,31,150