Governor Jishnu Dev Varma: విమోచన వర్చువల్ మ్యూజియం అద్భుతం
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:12 AM
నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నాడు జరిగిన ప్రజాపోరాటాలను కళ్లకు కట్టినట్టు చూపించేలా ఏర్పాటు చేసిన వర్చువల్ మ్యూజియం అద్భుతమని...
ప్రజాపోరాటాలను కళ్లకు కట్టారు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మజ్లిస్ అంటే బీఆర్‌ఎస్, కాంగ్రె్‌సకు భయం: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నాడు జరిగిన ప్రజాపోరాటాలను కళ్లకు కట్టినట్టు చూపించేలా ఏర్పాటు చేసిన వర్చువల్ మ్యూజియం అద్భుతమని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. తన సొంత రాష్ట్రమైన త్రిపుర చరిత్రను కూడా ఈ విధంగా ప్రదర్శించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సూచన చేస్తానని తెలిపారు. సెప్టెంబరు 17న నిర్వహించనున్న హైదరాబాద్ విమోచన దినోత్సవంలో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో ఫొటో ఎగ్జిబిషన్, వర్చువల్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించేలా చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ పార్టీకి భయపడి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని ఆరోపించారు. తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విమోచన వేడుకల ఆవశ్యకతను ప్రధానికి వివరించానని తెలిపారు. ఈనెల 17న రాష్ట్రంలోని ప్రజలంతా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి విమోచన వేడుకలను ఘనంగా జరపాలనిపిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పాల్గొన్నారు.