Violence and Victories Mark: ఓటు గొడవలు ఉద్రిక్తం!
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:38 AM
ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం, చింతకాని గ్రామాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో లాఠీచార్జి చేశారు. రామకృష్ణాపురంలో ఐదో వార్డులో....
ఖమ్మం జిల్లా రామకృష్ణాపురం, చింతకాని గ్రామాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో లాఠీచార్జి చేశారు. రామకృష్ణాపురంలో ఐదో వార్డులో ఒక ఓటరు ఓటు వేసి ఏజెంట్‌కు చూపించడంతో గొడవ జరిగింది. ఒక కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడలో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా గుమిగూడిన వివిధ పార్టీల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఫకీర్ మొయినుద్దీన్ అనే వ్యక్తికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌లో బుధవారం అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. గ్రామంలో ఓటర్లకు నగదు పంపిణీ సందర్భంగా ఈ ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలకు చెందినవారు గాయపడ్డారు.

పంచాయతీ కార్మికుడు... సర్పంచ్ అయ్యారు
ఇటీవలి వరకు పంచాయతీలో కార్మికుడిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు అదే పంచాయతీకి సర్పంచ్ అయ్యారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచిలాపురం పంచాయతీలో ఏర్పుల మోహన్‌బాబు మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేసేవారు. ఎన్నికల ముందు రాజీనామా చేసి, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేశారు. సీపీఐ మద్దతుదారు పెద్దమామిడి జానయ్యపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు.