Congress president Mahesh Kumar Goud: మరోమారు కాంగ్రెస్‌కు పట్టం కట్టిన పల్లెలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:52 AM
పంచాయతీ ఎన్నికల తుది విడతలోనూ పల్లె ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని, ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు..
ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం: మహేశ్ గౌడ్
హైదరాబాద్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల తుది విడతలోనూ పల్లె ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారని, ఈ తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంప పెట్టని, గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పునకు ఇది సంకేతమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ఓటర్లలో కాంగ్రె్‌సపై విశ్వాసాన్ని మరింత పెంచాయని తెలిపారు. ఈ విజయం పార్టీపై మరింత బాధ్యతను పెంచిందని, గ్రామీణ అభివృద్ధిని ఇంకా వేగవంతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేశ్‌గౌడ్ హామీ ఇచ్చారు.
నేడు బీజేపీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నిరసనలు
నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియా, రాహుల్‌పై ఈడీ చార్జిషీట్లు వేయడాన్ని కోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని బీజేపీ కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, అనుబంధ సంఘాలు ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. కాగా, జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన ధర్నా కార్యక్రమాలను ఆదివారానికి వాయిదా వేసినట్లు మహేశ్‌గౌడ్ వెల్లడించారు.