Villagers Threaten Election Boycott: సమస్యలు పరిష్కరించకపోతే బహిష్కరణే
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:03 AM
తమ గ్రామాల్లో సుదీర్ఘ కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తేనే పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటామని లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా కపూర్‌నాయక్‌తండా రైతులు, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు....
సిద్దిపేట జిల్లా కపూర్‌నాయక్‌తండా రైతులు, మెదక్ జిల్లాలో నాలుగు గ్రామాల ప్రజల హెచ్చరికలు
పోటీ చేయడం ఇష్టం లేక ఒకరు, పోటీ చేసే అవకాశం రాక మరొకరి ఆత్మహత్యాయత్నాలు
అక్కన్నపేట/వెల్దుర్తి, నాగర్‌కర్నూల్ క్రైం/మదనాపురం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తమ గ్రామాల్లో సుదీర్ఘ కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తేనే పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటామని లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా కపూర్‌నాయక్‌తండా రైతులు, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాత ముత్తాతల కాలం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములను ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ సమస్యను పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామంటూ కపూర్‌నాయక్‌తండాలో గిరిజన రైతులు ఆదివారం ర్యాలీ చేశారు. తమకు పట్టాలు ఇచ్చే వరకు ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చిచెప్పారు. అలాగే, వెల్దుర్తి నుంచి మెదక్ వరకు ప్రధాన రోడ్డును వెంటనే నిర్మించాలని లేకుంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామంటూ వెల్దుర్తి మండల పరిధిలోని శెట్టిపల్లి కలాన్, రామాయిపల్లి, బండపోసానిపల్లి, ఎదులపల్లి గ్రామాల ప్రజలు శెట్టిపల్లి కలాన్‌లో ఆదివారం రాస్తారోకో చేశారు. ఇక, సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అవకాశం కోల్పోయాననే మనస్తాపంతో ఒకరు, పోటీ చేయడం లేక మరొకరు ఆత్మహత్యకు యత్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామానికి చెందిన ఓర్సు బంగారయ్య ఆదివారం ఆత్మహత్యకు యత్నించాడు. శ్రీపురం సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కాగా బంగారయ్య పోటీ చేసే అవకాశం కోల్పోయాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డిని కలిసేందుకు బంగారయ్య ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయానికి వెళ్లాడు. కానీ ఎమ్మెల్యే లేకపోవడంతో కార్యాలయ ఆవరణలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇక, వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని దుప్పల్లి గ్రామానికి చెందిన గొల్ల సుజాత ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేక ఆత్మహత్యకు యత్నించింది. దుప్పల్లి స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా.. కాంగ్రెస్ మద్దతుతో ఆ పార్టీ నాయకుడు గొల్ల నాగరాజు తన భార్య గొల్ల సుజాతను అభ్యర్థిగా నిర్ణయించారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయాలని కుటుంబసభ్యుల నుంచి ఎదురైన ఒత్తిడిని తట్టుకోలేక సుజాత ఆదివారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.