KTR: పల్లె ప్రజల తీర్పు.. కాంగ్రెస్ పతనానికి నాంది!
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:08 AM
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు...
అధికార పక్షానికి 50 శాతం సీట్లు దక్కడం చరిత్రలో లేదు.. పల్లెల్లో చిచ్చుపెట్టిన రేవంత్‌కు జనం బుద్ధి చెప్పారు
బీఆర్‌ఎ్‌సకు ఇది సామాన్య విజయం కాదు. చరిత్రలో నిలిచిపోతుంది.. ఫలితాలతో సీఎంకు ముచ్చెమటలు పట్టాయి
మా కార్యకర్తలపై దాడులు తెగబడేవారికి బుద్ధి చెబుతాం: కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అధికార పక్షానికి ఏకపక్షంగా ఉంటాయని, అయితే ముఖ్యమంత్రి, కాలికి బలపం కట్టుకొని తిరిగినా.. మంత్రులు మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్ తంటాలు పడిందన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయన్నారు. అధికార పార్టీ ఇంత తక్కువ స్థానాలకు పరిమితం కావడం, ప్రదాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలను గెలవడం గతంలో ఎన్నడూ లేదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసాలు, వైఫల్యాలపై తెలంగాణ పల్లె ప్రజలు మోగించిన జంగ్ సైరన్ అని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని, హామీలు అమలు చేయకుండా.. రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారని, పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. రెండేళ్లలో హామీలు అమలు చేయకుండా, పల్లెల్లో రాజకీయ హింసను తెచ్చిన కాంగ్రె్‌సకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈ తీర్పు తర్వాత రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పతనం కాక తప్పదన్నారు. కాంగ్రెస్ అదికార దుర్వినియోగాన్ని, బల ప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని, తమ పక్షాన నిలబడి పోరాడే బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఇది సామాన్య విజయం కాదని, చరిత్రలో నిలిచిపోయే పోరాటమని, ఈ యుద్ధంలో సైనికుల్లా పోరాడిన ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తకు సలాం చేస్తున్నానన్నారు. అరాచక కాంగ్రె్‌సను, రేవంత్‌రెడ్డిని మట్టి కరిపించేందుకు గులాబీ శ్రేణులు చేసిన అలుపెరగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో సమాధానం చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు. కాగా బీఆర్‌ఎ్‌సపార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో బుధవారం రాత్రి అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపార్టీ నేతలు సీహెచ్ రాకేశ్‌కుమార్, తలసాని సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.